Bhuvneshwar Kumar Retirement : టీమ్ఇండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్.. క్రికెట్‌కు వీడ్కోలు పలుకనున్నాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో 'క్రికెటర్' అనే పదాన్ని తొలగించాడు భువీ. ఇదివరకు 'ఇండియన్ క్రికెటర్' అని ఉండగా.. ఇప్పుడు 'ఇండియన్' అని మాత్రమే ఉంది. దీంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. మరి భువీ ఎందుకు అలా చేశాడన్నదానిపై క్లారిటీ లేదు. కాగా భువీ తాజా చర్యల వల్ల అతడి ఫ్యాన్స్ ఆందోళనలో పడ్డారు. కానీ తన రిటైర్మెట్పై భువీ ఎక్కడ కూడా అధికారికంగా ప్రస్తావించలేదు.
Bhuvneshwar Kumar International Career : ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన భువీ 2012లో పాకిస్థాన్‌పై టీ20తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. వన్డేలో అరంగేట్ర మ్యాచ్‌లో మొదటి బంతికే వికెట్ తీసిన.. బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. దాదాపు ఒక దశాబ్ద కాలంపాటు టీమ్ఇండియాలో నిలకడతో కూడిన ఆటతో రాణించాడు. బంతిని ఇరువైపులా స్వింగ్ చేస్తూ.. ప్రత్యర్థులను ఇబ్బందుల్లోకి నెట్టగలడు భువీ. తన ప్రదర్శనతో భువీ.. కొంతకాలం బీసీసీఐ ఏ+ గ్రేడ్ కాంట్రాక్ట్‌లో కూడా కొనసాగాడు. అయితే కొద్ది రోజుల నుంచి భువీ ఫామ్‌లేమితో నానాతంటాలు పడుతున్నాడు.
గతేడాది జవవరిలో సౌత్ఆఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆడిన భువీ.. పేలవ ప్రదర్శన కారణంగా ఆ తర్వాత జాతీయ జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక అతడు 2018లో చివరిసారిగా టెస్టు మ్యాచ్ ఆడాడు. అప్పటినుంచి టెస్టుల్లో భువీ బౌలింగ్ చేయలేదు. ఇక ఆసియా కప్ 2022, టీ20 ప్రపంచకప్ 2022లో ఆడిన భువనేశ్వర్.. ఆ రెండు టోర్నమెంట్లలో విఫలమయ్యాడు. అప్పటినుంచి అతడు జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు.
Bhuvneshwar Kumar Wickets : అంతర్జాతీయ కెరీర్లో భువీ.. టెస్టుల్లో 63, వన్డేల్లో 141, టీ20ల్లో 90 వికెట్లు పడగొట్టాడు. ఇక దేశవాలీ ఐపీఎల్లో మొదటగా ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు, తర్వాత రెండేళ్లు పుణె జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత 2014 నుంచి భువీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతున్నాడు. ఈ ఏడాది ఇదే జట్టుకు సారధిగా వ్యవహరించాడు. అయితే భువీ అటు జాతీయ జట్టుతో పాటు ఇటు ఐపీఎల్‌లోనూ వరుస వైఫల్యాలతో కెరీర్లో సతమతమౌతున్నాడు. ఈ కారణంగా బీసీసీఐ భువీని.. సెంట్రల్ కాంట్రక్ట్ లిస్ట్‌లో నుంచి కూడా తీసేసింది.
మరోవైపు భువనేశ్వర్ తాజా చర్యల వల్ల ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. తొందరపాటులో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవద్దని అతడికి సూచిస్తున్నారు. అతడు మళ్లీ జాతీయ జట్టులోకి వస్తాడంటూ అభిమానులు ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు.