Bhuvneshwar Kumar Ranji 8 Wickets:టీమ్ఇండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కూమార్ రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. దాదాపు ఆరేళ్ల తర్వాత టెస్టు ఫార్మాట్ (ఫస్ట్ క్లాస్ కెరీర్)లో రీ ఎంట్రీ ఇచ్చిన భువీ తొలి మ్యాచ్‌లోనే 8 వికెట్లతో సత్తా చాటాడు. భువీ ప్రస్తుత రంజీ ట్రోఫీలో ఉత్తర్‌ప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్- బంగాల్ మధ్య మ్యాచ్‌లో భువీ ఎనిమిది వికెట్లు నేలకూల్చి ఔరా అనిపించాడు. భువీ దెబ్బకు బంగాల్ 188 పరుగులకే ఆలౌటైంది. దీంతో భువనేశ్వర్ ఒక్కసారిగా క్రికెట్ విశ్లేషకుల దృషిని తనవైపు తిప్పుకున్నాడు.
జనవరి 12న ఉత్తర్‌ప్రదేశ్- బంగాల్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన బంగాల్, యూపీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలి ఇన్నింగ్స్‌లో యూపీ 20.5 ఓవర్లలో 60 పరుగులకే ఆలౌటైంది. దీంతో బంగాల్ తొలి రోజే బ్యాటింగ్‌కు దిగింది. అయితే యూపీ బౌలర్ భువీ ఆరంభం నుంచే స్వింగ్‌తో బ్యాటర్లను తికమక పెట్టాడు. దీంతో తొలి రోజే 5 వికెట్లు పడగొట్టి బంగాల్‌ను తీవ్రంగా దెబ్బకొట్టాడు. ఇక బంగాల్ 95-5స్కోర్ వద్ద తొలిరోజు ఆట ముగిసింది. అయితే బంగాల్ ఫస్ట్ డే కోల్పోయిన 5 వికెట్లు కూడా భువీ పడగొట్టినవే కావడం విశేషం. ఇక 95-5 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో బ్యాటింగ్ ప్రారంభించిన బంగాల్ 58.2 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. యూపీ బౌలర్లలో భువనేశ్వర్ 8, యశ్ దయాల్ 2 వికెట్లు పడగొట్టారు.