Bhuvneshwar Kumar Gavaskar: టీమ్‌ఇండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఫామ్‌పై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా అతడికి మళ్లీ భారత జట్టులో చోటు దక్కడం కష్టమేనని అన్నాడు. రానున్న రెండు ప్రపంచకప్‌ల దృష్ట్యా భారత జట్టు యాజమాన్యం నాణ్యమైన ఆటగాళ్లను వెలికి తీయాల్సిన అవసరముందని సూచించాడు. సమయం తక్కువగా ఉన్నందున వీలైనంత త్వరగా టీ20, వన్డే ఫార్మాట్లలో సత్తా చాటగల క్రికెటర్లను సిద్ధం చేయాలని చెప్పాడు.
కాగా, ఈ ఏడాది అక్టోబరులో టీ20 ప్రపంచకప్, 2023 అక్టోబరులో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానున్నాయి. వన్డే ప్రపంచకప్ స్వదేశంలో జరుగనుండటం వల్ల సహజంగానే భారత్‌పై భారీ అంచనాలు ఉంటాయి. వాటిని అందుకోవాలంటే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ సత్తా చాటగల క్రికెటర్లను ఎంపిక చేసుకోవాలని గావస్కర్ అన్నాడు.
'యువ బౌలర్ల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో.. రానున్న ప్రపంచకప్ జట్టులో భువనేశ్వర్ కుమార్‌కు చోటు దక్కడం కష్టమేననిపిస్తోంది. అతడి బౌలింగ్‌లో మునుపటి పదును, కచ్చితత్వం కనిపించడం లేదు. అలా అని గతంలో భువీ టీమ్‌ఇండియాకు అందించిన సేవలను తక్కువ అంచనా వేయలేం. గత కొద్దికాలంగా ఫామ్‌పరంగా అతడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అవకాశం వచ్చిన మ్యాచుల్లో కూడా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. యార్కర్లు, స్లో డెలివరీలతో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు అతడి బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నారు. అందుకే, అతడు కొంత కాలం విరామం తీసుకుని బౌలింగ్‌పై దృష్టి పెడితే బాగుంటుంది. ప్రస్తుతానికైతే భువనేశ్వర్ స్థానాన్ని భర్తీ చేయగల బౌలర్‌ను వెతకాల్సిన సమయం ఆసన్నమైందనుకుంటున్నాను. అతడి స్థానంలో యువ ఆటగాడు దీపక్ చాహర్‌కు మరిన్ని అవకాశాలిచ్చి.. మెరుగైన బౌలర్‌గా తీర్చిదిద్దాలి. అతడు బంతితో పాటు, బ్యాటుతోనూ సత్తా చాటగలడు’ అని సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో దీపక్ చాహర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.