Virat Kohli: టీమ్‌ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం జట్టులో ఎంత కీలక ఆటగాడో అందరికీ తెలుసు. 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు అరంగేట్రం చేసిన అతడు అనతి కాలంలోనే ఫార్మాట్లకు అతీతంగా మేటి బౌలర్‌గా ఎదిగాడు. అయితే, అతడి టెస్టు అరంగేట్రం అనూహ్యంగా జరిగిందని భారత మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ గుర్తుచేసుకున్నాడు. ఇటీవలే ఆయన ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడుతూ బుమ్రా టెస్టుల్లోకి ఎలా వచ్చాడో వివరించాడు. నాటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, బుమ్రాను అప్పటికప్పుడు ఎంపిక చేశాడని పేర్కొన్నాడు.
"2018 దక్షిణాఫ్రికా పర్యటనకు మేం 10-12 రోజుల ముందు నుంచే ప్రాక్టీస్ చేశాం. ఆ సమయంలో నెట్స్‌లో బుమ్రా సాధన చూసి కోహ్లీ అమితంగా ఆశ్చర్యపోయాడు. అక్కడున్న బౌలర్ల అందరిలో అతడే అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని చెప్పాడు. దీంతో వెంటనే బుమ్రాను తొలి టెస్టులో ఆడించాలని నిర్ణయించుకున్నాడు. అక్కడి నుంచి అతడి కెరీర్ మారిపోయింది. అయితే, అంతకుముందు బుమ్రా వన్డేల్లో ఆడేటప్పుడే టెస్టు క్రికెట్‌లో రాణించాలని ఉందని నాతో చెప్పాడు. అన్ని ఫార్మాట్లలో మేటి బౌలర్‌గా పేరు తెచ్చుకోవాలని ఉందన్నాడు. నేను అదే విషయాన్ని కోచ్ రవిభాయ్‌తో చెప్పడం వల్ల.. అప్పుడతను బుమ్రాను టెస్టుల్లో ఆడిస్తే జట్టుకు ప్రయోజనకరమని అన్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా పర్యటనలో బుమ్రాకు టెస్టుల్లో అవకాశం ఇవ్వాలని అనుకున్నారు. వెంటనే కోహ్లీ కూడా సెలెక్టర్లతో మాట్లాడి అతడిని తొలి టెస్టులో ఆడించాడు"