క్రికెట్లో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపెల్(Ian chappell news) కీలక వ్యాఖ్యలు చేశారు. అధునాతన బ్యాట్లు, దగ్గర బౌండరీల కాంబినేషన్లో క్రికెట్ ఆడటం వల్ల బౌలర్లు వర్చువల్ బౌలింగ్ మెషీన్లుగా మారుతారని అభిప్రాయపడ్డారు. టీ20ల్లో ఆటకు, వినోదం మధ్య సమతుల్యతను పాటించేందుకు నిర్వాహకులు సరైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ క్రికెట్ వెబ్సైట్లో ఆయన వ్యాసం(Ian chappell column) రాశారు.
"బ్యాట్, బంతికి మధ్య సమతుల్యాన్ని పాటించాల్సిన అవసరం నిర్వహకులకు ఉంది. క్రికెట్ విలువలను అభిమానులకు బోధించాలి. మిడిల్ డెలివరీ బంతులను బ్యాటర్లు స్టాండ్స్‌లో చేరిస్తే బాగుంటుంది. కానీ, అప్పుడు బౌలర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యేలా పరిస్థితులు ఉండాలి. మంచి బ్యాట్లు, దగ్గర బౌండరీల్లో ఆడటం అనేది ఎంతవరకు సమంజసమో నాకు తెలీదు. ఇలా ఆడితే బౌలర్లు.. వర్చువల్ బౌలింగ్ మెషీన్లలా మారిపోతారు. ఇది ఉత్తమ బౌలర్లపై ప్రభావం చూపుతుంది. ఈ తరహా సమస్య ఆస్ట్రేలియాలోని పెద్ద మైదానాల్లో మాత్రమే లేదు. ఈ పద్ధతిని తక్షణమే సరిదిద్దాల్సిన అవసరం ఉంది"
-ఇయాన్ చాపెల్, ఆసీస్ క్రికెట్ దిగ్గజం