Best women players performance in 2021: క్రీడారంగంలో పురషులకు పోటీగా మహిళలు కూడా సత్తా చాటుతున్నారు. అద్భుత ప్రదర్శనతో రికార్డులు సృష్టిస్తున్నారు. అలా ఈ ఏడాది ఒలింపిక్స్ సహా ఇతర పోటీల్లో పాల్గొని భారత కీర్తి పతకాన్ని రెపరెపలాడేలా చేశారు. ఈ సంవత్సరం వారు సాధించిన ఘనతలను ఓ సారి నెమరువేసుకుందాం..
21ఏళ్ల తర్వాత
Meerabai olympics: మణిపుర్ మణిపూస మీరాబాయి చాను.. ప్రతిష్ఠాత్మకమైన అత్యున్నత క్రీడా పోటీలు టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించి భారత త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదికగా రెపరెపలాడించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో కరణం మల్లీశ్వరి తర్వాత భారత్‌కు పతకం అందించింది. దాదాపుగా 21 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో అద్భుతాన్ని ఆవిష్కరించింది. మహిళల 49 కిలోల విభాగంలో భారత కీర్తి పతాకను శిఖరాగ్రాలకు చేర్చింది. స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 115 కిలోలు.. మొత్తంగా 202 కిలోలు ఎత్తింది. ఒలింపిక్స్ ఆరంభమైన రెండో రోజే భారత పతకాల కొరతను తీర్చేంది.
ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు
Avani lekhara paralympics: పారా షూటర్ అవనీ లేఖరా.. ఈ ఏడాది అద్భుతం చేసింది. ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు అందుకున్న ఏకైక మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించి 19 ఏళ్లకే దిగ్గజంగా మారింది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఎస్‌హెచ్ 1 పోటీల్లో కాంస్య పతకం గెలవగా.. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1లో రికార్డు స్కోరుతో స్వర్ణ పతకాన్ని అందుకుంది.
ఇదే తొలి పతకం
టోక్యో పారాలింపిక్స్‌లో అదిరిపోయే ప్రదర్శన చేసింది భవీనాబెన్. టేబుల్ టెన్నిస్‌లో రజతం సాధించింది. స్వర్ణ పతక పోరులో ప్రపంచ నంబర్ వన్, చైనా క్రీడాకారిణి యింగ్ జావో చేతిలో 0-3 తేడాతో భవీనా ఓటమి పాలవ్వడం వల్ల ఆమె రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పారాలింపిక్స్ చరిత్రలోనే టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం గమనార్హం.
లవ్లీనా బోర్గోహెయిన్ 'కంచు' పంచ్
లవ్లీనా బొర్గొహెయిన్ చరిత్ర సృష్టించింది. 69కిలోల విభాగంలో తలపడి ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా అవతరించింది. అరంగేట్రం మెగా క్రీడల్లోనే పోడియంపై నిలబడిన బాక్సర్‌గా దేశానికి వన్నె తెచ్చింది.
తొలిసారి సెమీస్‌కు.. చరిత్ర సృష్టించారు
teamindia hockye team semifinal: రాణి రాంపాల్ సారథ్యంలోని భారత మహిళా హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ సెమీఫైనల్‌కు చేరుకున్న భారత తొలి మహిళా హాకీ జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనాపై 1-2 తేడాతో ఓటమి పాలైంది. ఇక బ్రిటన్‌తో జరిగిన కాంస్య పోరులోనూ 3-4 తేడాతో ఓడింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయినప్పటికీ దేశం గర్వించే స్థాయిలో ప్రదర్శన చేసింది.
రెండో పతకం
టోక్యో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో హోరాహోరీగా సాగిన పోరులో వరుస గేమ్స్‌లో 21-13, 21-15 తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆమె రెండో పతకం అందించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు.. తాజా ఒలింపిక్స్‌లో కాంస్యంతో సరిపెట్టుకుంది. కాగా, ఈ ఏడాది ఇండోనేషియా మాస్టర్స్, ఫ్రెంచ్ ఓపెన్, ఇండోనేషియా ఓపెన్‌లో ఆడిన సింధు కనీసం సెమీస్ కూడా దాటలేకపోయింది. అయితే బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు చేరినప్పటికీ ఓడిపోయింది. మొత్తంగా ఈ ఏడాది టైటిల్ గెలవకుండానే ముగించింది.
పతకం రాకుంటేనే ముద్దుబిడ్డ అయింది
Golfer Aditi ashok: టోక్యో ఒలింపిక్స్‌లో ఎవరూ ఉహించని స్థాయిలో అద్భుతం చేసింది గోల్ఫర్ అదితి అశోక్. వరల్డ్ నంబర్ వన్‌తో పాటు టాప్-10 క్రీడాకారిణులకు ముచ్చెమటలు పట్టించింది. ఎలాంటి అంచనాలు లేని దశ నుంచి ఏకంగా పతకంపై ఆశలు కల్పించింది. అయితే ఫైనల్ రౌండ్లలో ఆమెను దురదృష్టం వెక్కిరించడం వల్ల త్రుటిలో పతకం కోల్పోయింది. నాలుగో స్థానంలో నిలిచి భారమైన హృదయంతో మైదానాన్ని వీడింది. అయితేనేం ప్రపంచ క్రీడల్లో ఆమె చూపిన తెగువను చూసి యావత్ భారతదేశం ఆమెను ప్రశంసించింది.
నేత్రా కుమారన్(సెయిలర్), భవానీ దేవీ(ఫెన్సింగ్), మనికా బాత్రా(టేబుల్ టెన్నిస్) భారత మహిళా ఫుట్‌బాల్ జట్టు, కూడా ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శనతోనే ఆకట్టుకున్నారు.
డ్రాగా ముగించారు
మహిళల క్రికెట్ జట్టు: ఈ ఏడాది భారీ టోర్నీలు ఆడనప్పటికీ.. టెస్ట్‌ల్లో మంచి ప్రదర్శన చేసింది. ఏడేళ్ల తర్వాత ఆడిన తొలి టెస్ట్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో కీలకంగా వ్యవహరించింది. ఆస్ట్రేలియాతో డే అండ్ నైట్ టెస్ట్‌ను డ్రాగా ముగించారు. మొత్తంగా మంచి ప్రదర్శన చేశారు.
మొత్తంగా ఈ క్రీడాకారిణిలు అంతా గెలుపోటములను పక్కనపెడితే ఒలింపిక్స్ సహా ఆడిన పలు ట్రోర్నీల్లో మంచి ప్రదర్శనే చేశారు.
ఇదీ చూడండి: Team India Shedule 2022: వచ్చే ఏడాది టీమ్ఇండియా షెడ్యూల్ ఇదే!