Ben Stokes World Cup 2023 : ఇంగ్లాండ్ జట్టులో కీలక పాత్ర పోషించే బెన్ స్టోక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఆట తీరుతో పాటు కెప్టెన్సీ స్కిల్స్‌లో రాణిస్తున్న ఈ స్టార్ ఆల్ రౌండర్ ప్రస్తుతం వన్డే ప్రపంచకప్‌లో తన ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ఇక స్టోక్స్‌తో పాటు అత్యంత విధ్వంసకర బ్యాటర్లలో లియామ్ లివింగ్‌స్టోన్ కూడా పేరొందిన ప్లేయర్. ప్రస్తుతం ఈ ఇద్దరూ వరల్డ్ కప్‌లో భాగంగా భారత్‌లో పర్యటిస్తున్నారు. అయితే ఇటీవలే ఈ ఇద్దరు తృటిలో ఓ ప్రమాదాన్ని తప్పించుకున్నారట. ఈ విషయాన్ని బెన్ స్టోక్స్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఇటీవలే స్టోక్స్, లివింగ్‌స్టోన్ కోల్, ఆండీ మిచెల్‌తో కలిసి ఓ షేర్ ఆటోలో ఎక్కారు. చాలా స్పీడ్‌గా వెళ్తున్న సమయంలో ఆ ఆటో ఓ కారును ఢీ కొట్టబోయింది. అయితే త్రుటిలో వారు ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు స్టోక్స్ ఓ వీడియో చూపించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇక బెన్ స్టోక్స్ గత ఏడాది జులైలో వన్డే ఇంటర్నేషనల్స్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వరల్డ్ కప్ తొలి మూడు మ్యాచ్‌లకూ రాలేదు. తుంటి సమస్యతో బాధపడుతున్న కారణంగా అతడు మొదటి మూడు గేమ్‌లకు దూరమయ్యాడు. అయితే అతని అవసరం పడటం వల్ల మళ్లీ అతడిని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వెనక్కి పిలిపించింది. అలా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ కోసం తిరిగి జట్టులోకి వచ్చాడు. అయినప్పటికీ ఇంకా కోలుకోనందున బెన్ మునుపటిలా ఆడలేకపోతున్నాడు.