భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) కొత్త సెలెక్షన్ కమిటీ నియామకం ఈ ఏడాది లేనట్లే. సెలెక్షన్ కమిటీ సభ్యుల నియామకం కోసం దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల జాబితాను ఇప్పటికే బీసీసీఐ వడపోత పోసింది. ఇక శుక్రవారం క్రికెట్ సలహా మండలి (సీఏసీ) ఇంటర్వ్యూలను నిర్వహించనుందని సమాచారం. అశోక్ మల్హోత్రా, జతిన్ పరంజ్‌పే, సులక్షణ నాయక్ డిసెంబర్ 30న సమావేశమై ఇంటర్వ్యూ కార్యక్రమం చేస్తారని తెలుస్తోంది. అయితే అనివార్య కారణాల వల్ల భేటీ వాయిదా పడినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
30న సెలెక్షన్ కమిటీ ఇంటర్వ్యూలు.. కొత్త టీమ్ ప్రకటన వచ్చే ఏడాదే - bccis selection committee interview date
చేతన్ శర్మ ఛైర్మన్‌గా ఉన్న సెలెక్షన్ కమిటీని బీసీసీఐ రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే దాదాపు నెలరోజులు గడిచినా కమిటీని ఇంతవరకు ఎంపిక చేయలేదు. దీంతో కొత్త సంవత్సరంలోనే నూతన కమిటీ ప్రకటన ఉంటుందని క్రీడా వర్గాల సమాచారం.
చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీని బీసీసీఐ రద్దు చేసిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో భారత్ ఓడిన వెంటనే బీసీసీఐ ఈ చర్యలను తీసుకొంది. చేతన్‌తోపాటు సునిల్ జోషి, హర్విందర్ సింగ్, దేబశిష్ మొహంతీని తప్పించింది. దీంతో కొత్త సెలెక్షన్ కమిటీ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది.
దాదాపు 50 మంది వరకు దరఖాస్తు చేసుకొన్నట్లు సమాచారం. చేతన్ శర్మ, హర్విందర్ సింగ్ కూడా మరోసారి అప్లై చేశారని, వారిద్దరూ సభ్యులుగా కొనసాగే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే ఛైర్మన్‌కు ఏడాదికి రూ.1.25 కోట్లు, ప్యానెల్ సభ్యులకు ఇచ్చే రూ. కోటి ప్యాకేజీ ఆకర్షణీయంగా లేకపోవడంతో చాలా మంది పెద్ద క్రికెటర్లు దరఖాస్తు చేసేందుకు ఆసక్తి చూపలేదనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.