అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC News).. రాబోయే పదేళ్లలో జరగనున్న 8 కొత్త టోర్నీల వివరాలను, వేదికలను మంగళవారమే ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ 3 ఐసీసీ టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. 2026 టీ20 ప్రపంచకప్ (శ్రీలంకతో సంయుక్తంగా), 2029 ఛాంపియన్స్ ట్రోఫీ, 2031 వన్డే ప్రపంచకప్‌నకు(బంగ్లాదేశ్‌తో సంయుక్తంగా) మన దేశంలోనే జరగనున్నాయి. ఈ టోర్నీల నిర్వహణలో భాగంగా దాదాపు రూ. 1500 కోట్ల పన్ను భారం నుంచి బయటపడే అవకాశం భారత క్రికెట్ నియంత్రణ మండలికి(BCCI news) లభించింది.
ఐసీసీ భరిస్తుంది..
భారత ప్రభుత్వం నుంచి బీసీసీఐకి 10 శాతం కూడా పన్ను మినహాయింపు లభించదు. ఈ నేపథ్యంలో 2024-31 మధ్య భారత్‌లో జరిగే ఐసీసీ టోర్నమెంట్లకు వచ్చే పన్ను నష్టాన్ని భరించేందుకు అంగీకరించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. దీంతో బీసీసీఐకి ఉపశమనం లభించింది.
అయితే.. 2016 టీ20 ప్రపంచకప్, 2023 వన్డే ప్రపంచకప్ నిర్వహణ నేపథ్యంలో బీసీసీఐపై దాదాపు రూ. 750 కోట్ల పన్ను భారం పడుతుందని తెలుస్తోంది. 2021 టీ20 ప్రపంచకప్ కూడా భారత్ వేదికగా జరిగి ఉంటే.. ఈ భారం రూ. 1000 కోట్లకు పైగానే ఉండేది.
ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జై షా ఐసీసీతో ఈ పన్ను భారం అంశాన్ని లేవనెత్తినట్లు సమాచారం. దీంతో.. అంత మొత్తాన్ని బీసీసీఐ వ్యక్తిగతంగా భరించడం ఇబ్బంది అని ఐసీసీ బోర్డు అభిప్రాయపడినట్లు తెలిసింది. "ఇతర క్రికెట్ బోర్డులన్నిటికీ తమ దేశ ప్రభుత్వాల నుంచి పన్ను మినహాయింపు ఉంటుంది. కానీ, కేంద్ర ప్రభుత్వం తమ కోసం చట్టాలను మార్చాలని బీసీసీఐ ఆశించదు. అందుకే.. పన్ను భారాన్ని మొత్తం ఐసీసీ భరించాలి. భారత్‌లో జరిగే ఈవెంట్లతో బీసీసీఐ అధిక ఆదాయాన్ని అర్జిస్తోంది. అందుకే ఐసీసీకి వచ్చే ఆదాయం నుంచి బీసీసీఐ కోత విధించాల్సి అవసరం కూడా లేదు" అని ఓ అధికారి తెలిపారు.
ఇదీ చదవండి:
భారత్‌లో 3 ఐసీసీ టోర్నమెంట్లు- పాక్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ