క్రికెట్లో మహిళల భాగస్వామ్యం పెంచే దిశగా బీసీసీఐ మరో అడుగు ముందుకు వేయనుంది. దేశ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా పురుషుల క్రికెట్లో మహిళా అంపైర్లను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. త్వరలో ప్రారంభం కాబోయే రంజీ ట్రోఫీ-2022 నుంచి ఈ ప్లాన్‌ను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి బోర్డు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
"త్వరలో ప్రారంభంకాబోయే రంజీ సీజన్ నుంచి మ్యాచ్‌లకు ఉమెన్ అంపైర్లు కూడా అంపైరింగ్ చేయబోతున్నారు. ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో కూడా మహిళా అంపైర్లను (భారత్ ఆడే మ్యాచ్‌లకు) చూడొచ్చు.." అని ఓ బీసీసీఐ ప్రతినిధి తెలిపారు. ఇటీవలే మహిళా క్రికెటర్ల వేతనాలను పురుషులతో సమానంగా పెంచిన బీసీసీఐ తాజాగా మరో చారిత్రక నిర్ణయం తీసుకోవడం అభినంచదగ్గ విషయం
మహిళా అంపైర్లుగా వృందా రతి, జనని నారాయణ్, వేణుగోపాలన్లు ప్రస్తుతం భారత మహిళా జట్టు ఆడేమ్యాచ్ లకు పనిచేస్తున్నారు. ఈ ముగ్గురే ఇప్పుడు ఉమెన్ అంపైర్లుగా రంజీలలో కనిపించనున్నట్టు సమాచారం. ముంబయికి చెందిన వృందా రతి.. స్కోరర్‌గా పనిచేసేవారు. కానీ న్యూజిలాండ్‌కు చెందిన అంపైర్ కాతీ క్రాస్ స్ఫూర్తితో ఆమె అంపైర్‌గా రాణిస్తున్నారు. తమిళనాడుకు చెందిన జనని నారాయణ్ చెన్నైలో సాఫ్వేర్ ఇంజినీర్ ఉద్యోగాన్ని వదిలి అంపైర్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన అంపైర్ల ఇంటర్వ్యూలో నెగ్గిన ఆమె తర్వాత బీసీసీఐ నిర్వహించే మ్యాచ్‌లకు కూడా అంపైరింగ్ చేస్తున్నారు. ఇక గాయత్రి వేణుగోపాలన్‌కు కూడా మొదట్లో క్రికెట్ గురించి పెద్దగా అవగాహన లేకపోయినా తర్వాత ఆట మీద ఆసక్తితో అంపైరింగ్లోకి వచ్చారు.
మహిళా జట్టు హెడ్ కోచ్ సంగతేంటి..బోర్డు పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. సీనియర్ మహిళా జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న రమేశ్ పవార్‌ను జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కు బదిలీ చేసింది బీసీసీఐ. అకాడమీలో పురుషుల జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. కాగా, ఇదివరకు ఇండియా ఏ, ఇండియా అండర్ 19 జట్లకు పనిచేసిన టీమ్ఇండియా మాజీ క్రికెటర్ హృషికేశ్ కనిట్కర్ను సీనియర్ మహిళా జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. ఆస్ట్రేలియాతో జరగబోయే 5 మ్యాచ్వ టీ20 సిరీస్‌కు మహిళా జట్టును ఆయన సన్నద్ధం చేయనున్నారు. అయితే ఇప్పటివరకు మహిళా జట్టు హెడ్ కోచ్‌ను మాత్రం బీసీసీఐ ప్రకటించలేదు.
ఇదీ చూడండి:మ్యాచ్ మధ్యలో ఫ్యాన్స్‌తో గొడవపడిన పాక్ క్రికెటర్.. కొట్టేందుకు యత్నం