తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోచింగ్‌ సిబ్బంది పనితీరుపై బీసీసీఐ చర్చ.. వారికి వార్నింగ్​! - డబ్ల్యూటీసీ ఫైనల్స్​ 2023 కోచ్​

డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమ్‌ఇండియా పరాజయాన్ని మూటగట్టుకున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి కోచ్​లపై పడింది. ఇకనైనా సత్ఫలితాలు రాబట్టకపోతే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ ఆ బృందాన్ని బీసీసీఐ పరోక్షంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది.

bcci indirectly warns teamindia coaches
bcci indirectly warns teamindia coaches

By

Published : Jun 14, 2023, 7:59 AM IST

వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టిన టీమ్​ ఇండియా.. ఆఖరివరకు పోరాడినప్పటికీ ఆసిస్​ చేతిలో ఓటమిని చవి చూసింది. సొంతగడ్డపై మేటిగా ఉన్నప్పటికీ పేస్‌ పిచ్‌లపై ఆడడంలో బలహీతను కొనసాగిస్తూ మరోసారి వెనుతిరిగింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌. ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లోనూ పేలవ ప్రదర్శనను కొనసాగించింది. దీంతో టీమ్ఇండియాపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఆటగాళ్లతో పాటు రాహుల్‌ ద్రవిడ్‌ నేతృత్వంలోని సహాయ సిబ్బందీ పైన కూడా క్రికెట్​ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సహాయ సిబ్బందిలో మార్పులు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌, బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రేలపైనే తీవ్ర విమర్శలు జరుగుతున్నాయి. ప్రధాన కోచ్‌ ద్రవిడ్‌ 2023 ప్రపంచకప్‌ వరకు సురక్షితంగానే ఉన్నారు. ఓ కోచ్‌గా ఆయన పని తీరుపై అంతగా విమర్శలు లేకపోయినా.. ప్రశంసలు కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎంత ప్రధాన కోచ్​ అయినప్పటికీ తనదైన ముద్ర వేయలేకపోయాడన్న అభిప్రాయం మాత్రం అభిమానుల్లో బలంగా ఉంది. ఓ క్రికెటర్‌గా సక్సెస్​ అయిన ద్రవిడ్‌.. కోచ్‌గా అంచనాలను అందుకోలేకపోయాడన్నది వాస్తవం.

ఇప్పుడు అతడి పదవికి ముప్పు లేకపోయినప్పటికీ.. జట్టు ప్రదర్శన ఇంకా దిగిజారితే మాత్రం ప్రపంచకప్‌ తర్వాత కోచ్​గా అతడికి గ్యారెంటీ ఉండకపోవచ్చని ఓ బీసీసీఐ అధికారి అన్నాడు. మొత్తంగా సహాయ సిబ్బందిపై వేటు వేయాల్సినంత ప్రమాదకరంగా ప్రస్తుత పరిస్థితి లేదన్నది ఆ అధికారి అభిప్రాయం. జట్టు ప్రదర్శన అంత ఘోరంగా ఏమీ లేదని, డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరడం అనుకున్నంత తేలిక కాదని అతడు అన్నాడు. అయితే విదేశాల్లో ప్రదర్శన మాత్రం సంతృప్తిగా లేదన్న అతడు.. ప్రపంచకప్‌ సమీపంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. మరోవైపు రాఠోడ్‌, మాంబ్రేల గురించి చర్చించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు చెప్పాడు.

బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాఠోడ్‌ ఉన్న సమయంలో.. భారత బ్యాటర్లు పెద్దగా విజయవంతం కాలేకపోయారు. ప్రతి టాప్‌ బ్యాటర్‌ కూడా పేలవ దశను చూసినవాడే. ముఖ్యంగా టాప్‌-5 బ్యాటర్లు విదేశాల్లో టెస్టుల్లో పరుగుల కోసం ఇబ్బంది పడటం అనేది ఆందోళన కలిగించే విషయం. ఇక బౌలింగ్‌ కోచ్‌గా తనదైన ముద్ర వేసిన భరత్‌ అరుణ్‌ స్థానంలో వచ్చినవాడే మాంబ్రే. అతను పెద్ద బాధ్యతలే స్వీకరించాడు. కానీ కొన్ని ప్రదర్శనలు మినహాయిస్తే.. అతడి పదవీకాలమంతా బౌలర్ల గాయాలతోనే గడిచాయి.

ఇక స్పిన్‌ అనుకూల పరిస్థితుల్లో మినహాయిస్తే విదేశాల్లో భారత బౌలింగ్‌ దళం పెద్దగా రాణించలేకపోయింది. ఫీల్డింగ్‌లోనూ అదే కథ. ఆర్‌.శ్రీధర్‌ హాయాంలో మంచి ఫీల్డింగ్‌ జట్టుగా ఉన్న భారత్‌.. ఇప్పుడు దిలీప్‌ ఆధ్వర్యంలో సర్వ సాధారణంగా మారిపోయింది. టీ20 ప్రపంచకప్‌, ఆసియాకప్‌, డబ్ల్యూటీసీ ఫైనల్లో ప్రదర్శనలే అందుకు మంచి ఉదాహరణ. ప్లాన్‌-బి లేదని.. బుమ్రా, పంత్‌ గాయాల తర్వాత వారి స్థానాలను సరైన రీతిలో భర్తీ చేయలేక పోయిందన్న ఆరోపణలు సైతం సహాయ సిబ్బంది పై ఉంది. ప్రత్యామ్నాయాలు చూడకుండా, వరుస వైఫల్యాల తర్వాత కూడా అదే ఆటగాళ్లకు కట్టుబడి ఉన్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

టీమ్‌ సెలక్షన్‌ పైనా కూడా ప్రశ్నలు తలెత్తాయి. ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచచకప్‌ మొత్తం స్పిన్నర్‌ చాహల్‌.. బెంచ్‌కే పరిమితం కావడం, డబ్ల్యూటీసీ ఫైనల్లో తమ అత్యుత్తమ స్పిన్నర్‌ అశ్విన్‌ను ఆడించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. మరి ఇప్పుడు అందరి దృష్టీ తమపైనే ఉన్న నేపథ్యంలో సహాయ సిబ్బంది తమ పని తీరును మెరుగుపరుచుకుంటారా లేదా వేటుకు గురవుతారా అన్నది వేచి చూడాలి.

ABOUT THE AUTHOR

...view details