BCCI Secretary Jay Shah: టీమ్ఇండియా హెడ్ కోచ్ బాధ్యతలను రాహుల్ ద్రవిడ్ స్వీకరించిన నేపథ్యంలో నేషనల్ క్రికెట్ అకాడమీ అధ్యక్ష పదవిని టీమ్ఇండియా మాజీ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ స్వీకరించనున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవికి అతడు ఇంకా అధికారికంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు.
"ఎన్సీఏ నియామకంపై త్వరలోనే ప్రకటన ఇవ్వనున్నాం. వీవీఎస్ లక్ష్మణ్ ఆ పదవికి ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంది." అని జై షా స్పష్టం చేశారు. కోల్‌కతాలో శనివారం నిర్వహించిన బీసీసీఐ 90వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.
టీ20 ప్రపంచకప్ అనంతరం టీమ్ఇండియా కోచ్‌గా వైదొలగనున్నట్లు రవిశాస్త్రి ప్రకటించాడు. ఈ నేపథ్యంలో టోర్నీ అనంతరం ఆ బాధ్యతలను రాహుల్ ద్రవిడ్ స్వీకరించాడు. దీంతో ఎన్సీఏ అధ్యక్ష పదవి ఖాళీ అయింది.
డిసెంబర్ 13నే..!
మరోవైపు.. వీవీఎస్ లక్ష్మణ్ డిసెంబర్ 13నే ఎన్సీఏ హెడ్ కోచ్ బాధ్యతలు స్వీకరించనున్నాడని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పడం గమనార్హం. లక్ష్మణ్ నియామకంతో పాటు ఇతర కోచ్‌ల ఎంపిక కూడా బీసీసీఐ ఆమోదించిందని ఆయన స్పష్టం చేశాడు.
'లక్ష్మణ్‌కు ఎన్సీఏ బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ ఆమోదించింది. డిసెంబర్ 13 నుంచి అతడు బెంగళూరులోని అకాడమీలో చేరనున్నాడు. అండర్-19 ప్రపంచకప్ కోసం అతడు వెస్టిండీస్ కూడా వెళ్లనున్నాడు.' అని బీసీసీఐ సీనియర్ అధికారి పేర్కొన్నాడు. అండర్-19 ప్రపంచకప్ నేపథ్యంలో హృషికేశ్ కంతికర్ లేదా సీతాన్షు కోటక్ ఎన్సీఏ హెడ్ కోచ్ బాధ్యతలు వహిస్తారని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మాజీ బౌలింగ్ కోచ్ ట్రాయ్ కూలీ పేస్ బౌలింగ్ కోచ్ అని తెలిపాడు. జై షా ప్రకటన చేసిన కొద్ది సేపటికే.. సీనియర్ అధికారి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.