టీమ్ ఇండియా మాజీ కెప్టెన్లు గంగూలీ, కోహ్లీకి మధ్య చాలా పోలికలున్నాయి. ఇద్దరూ భారత జట్టుకు సుదీర్ఘ కాలం పాటు కెప్టెన్‌గా నాయకత్వం వహించారు. మైదానంలో వీరు దిగితే దూకుడుగా ఆడతారు. మ్యాచ్ ఆసాంతం ఉద్వేగభరితంగా ఉంటారు. వారి చర్యలు, వారు జట్లను నడిపించే విధానం కూడా ఇంచుమించు ఒకేలా ఉంటుంది. కాబట్టి వీరిద్దరిని పోల్చుతూ కామెంట్లు, పోస్టులు రావడం సర్వసాధారణంగా జరిగేదే. అయితే తాజాగా దీనిపై స్పందించాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.
'పోలిక ఎప్పుడూ కూడా మన అగ్రెస్సివ్ నెస్ బట్టి ఉండకూడదు. ఎవరి నైపుణ్యం ఎంతుందో దాన్ని బట్టి ఉండాలి, కోహ్లీ తన కంటే ఎక్కువ నైపుణ్యం గల ప్లేయర్ అని' దాదా అన్నాడు. వారి దూకుడు ఆధారంగా కోహ్లీతో పోల్చడం గురించి గంగూలీని 'ది రణవీర్ షో'లో హోస్ట్ అడగగా గంగూలీ ఈ విధంగా బదులిచ్చాడు. 'అది పోలిక అని నేను అనుకోను. ఆటగాడిగా నైపుణ్యం పరంగా పోలిక ఉండాలి. అతను (కోహ్లీ) నా కంటే ఎక్కువ నైపుణ్యం కలిగి ఉంటాడని నేను భావిస్తున్నాను. మేము వేర్వేరు తరాలలో ఆడాం. ఇద్దరం చాలా క్రికెట్ ఆడాం. బహుశా నా కంటే అతను ఎక్కువ ఆటలు ఆడగలడు. ప్రస్తుతం గణాంకాల పరంగా నేను అతని కంటే ఎక్కువగా ఆడినట్లు కన్పించినా.. అతను దాన్ని అధిగమించగలడు. అతను అద్భుతమైన ప్లేయర్' అంటూ గంగూలీ కొనియాడాడు.