Ganguly on Team india: టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు వైఫల్యంపై బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్‌ఇండియా మాజీ సారథి సౌరభ్ గంగూలీ ఓ చర్చా కార్యక్రమం సందర్భంగా స్పందించాడు. 'గత నాలుగైదేళ్లలో నేను చూసిన టీమ్ఇండియా ప్రదర్శనల్లో ఇదే అత్యంత పేలవంగా ఉంది' అని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లపై ఓటమిపాలైన భారత్.. మిగతా మూడు మ్యాచ్‌లు (అఫ్గాన్, నమీబియా, స్కాట్లాండ్) గెలిచినా నాకౌట్ దశకు చేరుకోలేకపోయింది. అంతేకాకుండా తొలిసారి ప్రపంచకప్ టోర్నీల్లో పాక్ చేతిలో ఓడిపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్ కప్‌లో టీమ్‌ఇండియా మంచి ప్రదర్శన చేసిందని, అయితే 2021 టీ20 ప్రపంచకప్‌లో మాత్రం తన స్థాయి ఆటను ఆడలేదని గంగూలీ వివరించాడు.
"నిజంగా చెప్పాలంటే నాలుగేళ్ల నుంచి టీమ్‌ఇండియా చాలా బాగా ఆడుతోంది. 2017, 2019 ఐసీసీ టోర్నీల్లో అద్భుతంగా పోరాడింది. 2017 ఛాంపియన్స్ టోఫ్రీ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. అలానే వన్డే ప్రపంచకప్‌లోనూ సెమీస్ వరకు చాలా బాగా ఆడాం. అక్కడ కివీస్‌పై బోల్తాపడ్డాం. అయితే ఆ రెండు టోర్నీల్లోనూ భారత్ పోరాడి ఓడింది. అయితే 2021 టీ20 ప్రపంచకప్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా తొలి రెండు మ్యాచుల్లో కనీస పోరాటం చేయలేదు. గత నాలుగైదేళ్లుగా నేను చూసిన ప్రదర్శనల్లో ఇదే అత్యంత పేలవ ప్రదర్శన."
-- సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.