BCCI President Pakistan Visit :బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా.. పాకిస్థాన్ పర్యటనకు వెళ్లారు. ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ)తోపాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆహ్వానం మేరకు ఆసియా కప్ మ్యాచ్లుచూసేందుకు వారిద్దరూ వెళ్లారు. అయితే తమ రెండు రోజుల పర్యటన పూర్తి క్రికెట్ కోసమేనని.. రాజకీయాలకు సంబంధం లేదని రాజీవ్ శుక్లా తేల్చి చెప్పారు.
Asia Cup 2023 BCCI : పంజాబ్‌లోని అమృత్సర్ సమీపంలోని ఉన్న భారత్-పాక్ సరిహద్దు ప్రాంతం అట్టారీ-వాఘా బోర్డర్ ద్వారా పాక్‌లోకి రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లా సోమవారం ప్రవేశించారు. అంతకుముందు, అమృత్సర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ సమయంలో రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడారు. "ఈ రెండు రోజుల పర్యటన పూర్తిగా క్రికెట్ కోసమే.. రాజకీయంగా ఏమీ లేదు. విందుకు హాజరుకానున్నాం. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు అందులో పాల్గొంటాయి" అని రాజీవ్ శుక్లా తెలిపారు.
టోర్నమెంట్ కోసం భారత్ జట్టు.. ఎందుకు పాకిస్థాన్‌కు వెళ్లలేదని విలేకరులు ప్రశ్నించారు. తాము కేంద్ర ప్రభుత్వ సలహా ప్రకారమే నడుచుకుంటామని.. సర్కార్ ఏది నిర్ణయిస్తే అదే చేస్తామని రాజీవ్ శుక్లా బదులిచ్చారు. శ్రీలంకలో మ్యచ్‌లను చూసేందుకు కొలంబో వెళ్లినప్పటి నుంచి పాక్ పర్యటన కోసం తానెంతో ఎదురు చూస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ తెలిపారు. 2006 తర్వాత రోజర్ బిన్నీ పాక్‌కు వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం.