వచ్చే నెలలో టీ20 ప్రపంచకప్ పూర్తవగానే టీమ్ఇండియా ప్రధానకోచ్(Team India Coach) రవిశాస్త్రి పదవీ కాలం పూర్తవుతుంది. దీంతో అప్పుడే కొత్త కోచ్ వేటలో పడింది బీసీసీఐ. ఈ మేరకు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌లను సంప్రదించనున్నట్లు సమాచారం.
కుంబ్లే.. గతంలో ఏడాది పాటు (2016-17) భారత జట్టు ప్రధాన కోచ్‌గా(Team India Coach) పనిచేశాడు. ఆ సమయంలో సచిన్ తెందూల్కర్, లక్ష్మణ్, గంగూలీలతో కూడిన క్రికెట్ సలహా కమిటీ.. కుంబ్లేను నియమించింది. అయితే.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో భారత్ ఓడిపోవటం వల్ల ఆయన కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు.
మొదటి ప్రాధాన్యం ఎవరికి?
కుంబ్లేతో పాటు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌నూ.. సంప్రదించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. లక్ష్మణ్ ప్రస్తుతం ఐపీఎల్ హైదరాబాద్ టీమ్ సన్‌రైజర్స్‌కు మెంటార్‌గా ఉన్నాడు. వీరిద్దరిలో కుంబ్లేకే బీసీసీఐ మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.