ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో భాగమై నిషేధం ఎదుర్కొంటున్న స్పిన్నర్ అంకిత్ చవన్(Ankeet Chavan) మైదానంలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమం చేసింది బీసీసీఐ(BCCI). కోర్టు మార్గనిర్దేశాల ప్రకారం ఇతడి జీవితకాల శిక్షను ఏడేళ్లకు కుదిస్తున్నట్లు తెలిపారు బోర్డు సీఈఓ హేమంగ్ అమిన్. ఈ ఏడేళ్ల నిషేధం గతేడాది సెప్టెంబర్‌తోనే ముగిసింది. దీంతో అంకిత్ కాంపిటేటివ్ క్రికెట్ అడేందుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది. ఈ విషయంపై స్పందించిన అంకిత్.. బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపాడు.
"నేనెంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. మైదానంలో అడుగుపెట్టేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. ఈ విషయంలో సహాయం చేసినందుకు బీసీసీఐ, ముంబయి క్రికెట్ అసోషియేషన్‌కు కృతజ్ఞతలు. నిషేధం తొలగించగానే మైదానంలోకి వెళ్లి ప్రాక్టీస్ చేస్తా. ముంబయి జట్టుకు సెలక్ట్ అయినా కాకపోయినా నా పట్టుదలను మాత్రం కొనసాగిస్తా. మిగతాది భవిష్యత్ నిర్ణయిస్తుంది."