టెస్టు, వన్డేల్లో రోహిత్‌శర్మ కెప్టెన్సీని తొలగిస్తారంటూ చెలరేగుతున్న ఊహగానాలకు బీసీసీఐ ఫుల్‌స్టాప్ పెట్టింది. సాంప్రదాయ ఫార్మట్లలో రోహిత్‌శర్మ సారథ్యంపై బీసీసీఐ భరోసా ఉంచింది. టెస్టులు, వన్డేల్లో రోహిత్ నాయకత్వంపై బీసీసీఐ నమ్మకం ఉంచిందని అధికారి ఒకరు తెలిపారు. టీ20 జట్టును హార్దిక్ పాండ్య నడిపిస్తాడని వివరించారు. టీ20 ప్రపంచకప్, ఆసియా కప్‌ల్లో టీమ్ఇండియా వైఫల్యంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్న బీసీసీఐ సమీక్ష సమావేశం నిర్వహించింది.
ముంబయిలో బీసీసీఐ కార్యదర్శి జైషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. సారధి రోహిత్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, ఎన్సీఎ అధిపతి వీవీఎస్ లక్ష్మణ్, గత సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్య ఈ సమావేశానికి హాజరు కాలేదు. శ్రీలంకతో మంగళవారం నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండడంతో హార్దిక్ ఈ భేటీకి రాలేదు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్స్ ఫైనల్స్‌కు చేరుకునేందుకు భారత్‌కు అవకాశం ఉండడంతో దీనిపై సమీక్ష సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరో పది నెలల్లోనే 2023 వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండడంతో దీనిపైనా బీసీసీఐ రోడ్ మ్యాప్ ప్రకటించింది. 2023 ప్రపంచకప్ వరకు 20 మంది ఆటగాళ్లతో కూడిన పూల్‌ను పరీక్షించాలని కూడా ఈ సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.