Impact Player Rule Syed Mushtaq Ali Trophy : ఐపీఎల్‌లో ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను.. దేశవాళీ టీ20 క్రికెట్ కప్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ పూర్తి స్థాయిలో తీసుకురావాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. అక్టోబరు 16న మొదలయ్యే ముస్తాక్ అలీ టోర్నీలో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన అమలుకు శుక్రవారం బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను గతేడాదే ముస్తాక్ అలీ టోర్నీలో బీసీసీఐ ప్రవేశపెట్టింది. అయితే టాస్‌కు ముందే ఇంపాక్ట్ ప్లేయర్‌ను ప్రకటించి.. 14వ ఓవర్ ముగిసే లోపు తీసుకురావాలని సూచించింది. కానీ, ఈ ఏడాది నుంచి ఐపీఎల్‌లో మాదిరిగానే ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఉపయోగించొచ్చు. టాస్‌కు ముందు 11 మందితో పాటు నలుగురు సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్ల వివరాల్ని జట్లు ప్రకటించొచ్చు. నలుగురిలో నుంచి ఒక్కరిని మాత్రమే ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాలి. "రెండు జట్లు ప్రతి మ్యాచ్‌లో ఒక్కో ఇంపాక్ట్ ప్లేయర్‌ను వినియోగించుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఆడించడం తప్పనిసరేమీ కాదు" అని బీసీసీఐ మార్గదర్శకాల్లో చెప్పింది.
మరోవైపు సెప్టెంబరు- అక్టోబరులో హాంగ్‌జౌ (చైనా)లో జరిగే ఆసియా క్రీడల్లో భారత పురుషులు, మహిళల జట్లు పాల్గొనేందుకు అపెక్స్ కౌన్సిల్ ఆమోదించింది. పురుషుల విభాగంలో ద్వితీయ శ్రేణి జట్టును బీసీసీఐ బరిలో దించనుంది. మహిళల్లో ప్రధాన జట్టు పోటీపడుతుంది. ఆసియా క్రీడల చరిత్రలో మూడు సార్లు మాత్రమే క్రికెట్‌ను ఆడించారు. 2014 ఇంచియాన్ క్రీడల్లో చివరి సారిగా క్రికెట్‌ను చేర్చగా.. భారత్ అందులో పాల్గొనలేదు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పురుషులు, మహిళల విభాగాల్లో భారత జట్లను బరిలో దించడం ద్వారా జాతీయ ప్రయోజనాలకు సహకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బీసీసీఐ తెలిపింది.
సబ్‌స్టిట్యూట్.. ఇంపాక్ట్ ప్లేయర్ మధ్య తేడా..?
సాధారణంగా ఇప్పుడున్న సబ్‌స్టిట్యూట్ రూల్ ప్రకారం.. ఎవరైనా గాయపడితే మైదానంలోకి వచ్చే సబ్‌స్టిట్యూట్ బ్యాటింగ్, బౌలింగ్ చేయలేడు. కేవలం ఫీల్డింగ్ మాత్రమే చేయగలడు. అయితే కంకషన్ సబ్‌స్టిట్యూట్‌కు మాత్రం బ్యాటింగ్, బౌలింగ్ చేసే వీలుంది. ఎవరైనా ఆటగాడి తలకు గాయమైతేనే కంకషన్ వస్తాడు. అయితే సదరు గాయపడిన వ్యక్తి బ్యాటర్ అయితే బ్యాటర్.. బౌలర్ అయితే బౌలర్ మాత్రమే కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా రావాల్సి ఉంటుంది.