Richest cricket board : ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు అంటే ఏది అనగానే.. టక్కున ఏం ఆలోచించకుండా చెప్పే పేరు బీసీసీఐ. ఒక్క ఏడాదికే ఎన్నో వేల కోట్లను ఆర్జిస్తూ.. వరల్డ్ క్రికెట్‌లో అతి సంపన్నమైన బోర్డుగా పేరు పొందింది. అందుకే మన బోర్డు ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తోంది. అలాగే మిగతా బోర్డులు, జట్లపై ఆర్థికంగా ప్రభావం చూపిస్తోంది! ముఖ్యంగా ఐపీఎల్ విజయవంతం కావడం వల్ల బీసీసీఐ ఖజానా ప్రతి ఏటా భారీగా నిండుతూనే వస్తోంది. దీంతో రెవెన్యూ పరంగా మిగతా బోర్డులు.. బీసీసీఐకి ఆమడ దూరంలోనే నిలిచిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఐసీసీకి భారత్ జట్టు లేకపోతే ఆదాయం లేనట్టే! అయితే ఈ ఆదాయం విషయంలో ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చలాయిస్తున్న బీసీసీఐకి.. ఇప్పుడు మరోసారి కాసుల పంట పండనుందని తెలుస్తోంది.
Bcci revenue 2023 to 2027 : ఐసీసీ నుంచి ఆదాయంలో.. 2023 నుంచి 2027 వరకు అయిదేళ్ల కాలానికి గాను సుమారు రూ.9424 కోట్లను వాటాగా బీసీసీఐ పొందనుందట. ఈ ఐదేళ్లకు ఐసీసీ ఆదాయం(ICC Revenue) సుమారు రూ.24 వేల కోట్లు( ఉంటుందని అంచనా. అంటే అందులో దాదాపు 38.50 శాతం బీసీసీఐ ఖాతాలో చేరనుందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. దీనిపై ఇప్పటికైతే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ త్వరలోనే ఈ ప్రతిపాదన ఆమోదం పొందుతుందని తెలిసింది. ఈ విషయాన్ని ఓ ఐసీసీ సభ్యుడు తెలిపారు.