Ganguly Birthday: దాదా.. క్రికెట్ ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు. గంగూలీ రాకతో టీమ్‌ఇండియాకు 'ఫియర్ లెస్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్' పరిచయమైంది. ఎవరూ ఊహించని విధంగా భారత క్రికెట్ శైలినే మార్చేశాడు. టాలెంట్ గుర్తించి యువకులను ప్రోత్సహించాడు. వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ లాంటి వారిని స్టార్లుగా తీర్చిదిద్దాడు.
అన్నయ్య వల్లే క్రికెట్‌లోకి ఎంట్రీ...వాస్తవానికి గంగూలీ క్రికెట్ ఆడటం అతని తల్లిదండ్రులకు ఇష్టంలేదు. అయితే, అన్నయ్య స్నేహశీష్ గంగూలీ అప్పటికే మంచి పేరున్న బెంగాల్ క్రికెటర్. అతడి ప్రోత్సాహంతోనే గంగూలీ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. 1990-91 రంజీ సీజన్లో పరుగుల వరద పారించాడు. ఫలితంగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఆడిన ఏకైక మ్యాచ్‌లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు. తిరిగి దేశవాళీ క్రికెట్‌లో ఆడి రాణించాడు. 1995-96 దులీప్ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్‌లో 171 పరుగులు చేయడంతో మరోసారి జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఇంగ్లాండ్‌తో జరిగిన లార్డ్స్ టెస్టులో రాహుల్ ద్రవిడ్‌తో కలిసి గంగూలీ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో 131 పరుగులు సాధించి.. లార్డ్స్‌లో అరంగేట్రంలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన మూడో మ్యాచ్‌లో కూడా శతకం బాదాడు. సచిన్‌తో కలిసి 255 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో నాటి నుంచి జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకొన్నాడు.
కెప్టెన్‌గా విప్లవం..సచిన్ తరవాత వన్డే కెప్టెన్సీ బాధ్యతలను దాదా స్వీకరించాడు. తొలి సిరీస్‌లోనే బలమైన దక్షిణాఫ్రికాను 3-2 తేడాతో టీమ్‌ఇండియా ఓడించింది. ఆ తరవాత నాట్‌వెస్ట్ సిరీస్ విజయం గంగూలీ కెరీర్‌లోనే గొప్ప ఘనత. శ్రీలంక, ఇంగ్లాండ్, టీమ్‌ఇండియా తలపడిన ఈ ముక్కోణపు సిరీస్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. లార్డ్స్‌లో ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ఈ లక్ష్య ఛేదనకు ఓపెనర్‌గా వచ్చిన గంగూలీ 43 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు. సెహ్వాగ్‌తో కలిసి తొలి వికెట్‌కు 106 పరుగులు జోడించి ఔటయ్యాడు. ఆ తర్వాత టీమ్‌ఇండియా మిడిలార్డర్ వైఫల్యంతో 146 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే కైఫ్ (87*), యువరాజ్ (69) ఆదుకున్నారు. యువీ జట్టు స్కోరు 267 పరుగుల వద్ద ఔట్ అయ్యాక కైఫ్ లోయర్‌ఆర్డర్‌తో కలిసి పోరాటం చేశాడు. దీంతో భారత్ మరో 3 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయం అందుకున్నాక డ్రెస్సింగ్ రూమ్ బయట నుంచి దాదా చొక్కవిప్పి గాల్లో తిప్పిన దృశ్యం అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు.