BCCI Banned Crackers :దేశ రాజధాని దిల్లీ సహా ముంబయి నగరాల్లో వాయు కాలుష్యం కోరలు చాస్తున్న వేళ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు నగరాల్లో జరిగే ప్రపంచకప్ మ్యాచ్ల సందర్భంగా అభిమానలతో పాటు ఇంకెవ్వరూ బాణసంచాను కాల్చవద్దంటూ సూచించింది. ఇందుకు సంబంధించి బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు బీసీసీఐ సెక్రటరీ జై షా. ఈ విషయంపై ఐసీసీతో కూడా అధికారికంగా మాట్లాడినట్లు ఆయన తెలిపారు. 'పర్యావరణ పరిరక్షణ కోసం బీసీసీఐ ఎప్పుడు ముందుంటుంది, అలాగే వాయు కాలుష్యం సమస్యపై పోరాడేందుకు మేము ఎప్పటికీ కట్టుబడి ఉంటాము' అని జై షా చెప్పుకొచ్చారు.
'ఈసారి భారత్ వేదికగా జరుగుతున్న ICC ప్రపంచ కప్ క్రికెట్ సంబరాలను ఘనంగా నిర్వహించడానికి మేము కృషి చేస్తున్నాము. ఈ క్రమంలో పౌరుల ఆరోగ్యం, భద్రత విషయంలో కూడా రాజీపడే పసక్తే లేదు' అని జై షా అన్నారు.
"పర్యావరణ పరిరక్షణ పట్ల బీసీసీఐ చాలా సున్నితంగా వ్యవహరిస్తుంది. ఈ విషయంపై ఐసీసీతో కూడా అధికారికంగా చర్చించాను. దీనిపై ఐసీసీ కూడా సానుకూలంగా స్పందించింది. దీంతో దిల్లీ, ముంబయి నగరాల్లో జరిగే ప్రపంచకప్ మ్యాచ్ల కోసం ఎవరు కూడా బాణసంచాను కాల్చవద్దు. ఇది కాలుష్య స్థాయులను తగ్గిస్తుంది. పర్యావరణ సమస్యలపై పోరాడేందుకు క్రికెట్ బోర్డు ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది. ముంబయి, న్యూదిల్లీ నగరాల్లో గాలి నాణ్యతకు సంబంధించి తీసుకోవాల్సిన అత్యవసర చర్యలను BCCI గుర్తించింది. ఆ మేరకు టపాసులను కాల్చకూడదని నిర్ణయం తీసుకుంది."
- జై షా, బీసీసీఐ సెక్రటరీ