చైనాలో జరగనున్న ఆసియన్ గేమ్స్ 2023కి భారత క్రికెట్ జట్లను పంపించలేమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. ఇది వరకే ఉన్న ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ కమిట్మెంట్స్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ ప్రవేశపెట్టిన తరహాలో ఆసియన్ గేమ్స్‌లో కూడా ఈసారి క్రికెట్‌ను ప్రవేశపెట్టారు. ఆసియన్ క్రీడలు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలో జరగనున్నాయి. బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై.. ఇండియా ఆసియన్ గేమ్స్ చీఫ్ భుపేందర్ భజ్వా స్పందించారు. ఈసారి ఆసియన్ గేమ్స్‌లో అన్ని విభాగాల్లో ఎంట్రీ పేర్లు ఇచ్చామని.. కానీ బీసీసీఐ నిర్ణయం మేరకు క్రికెట్లో ఇవ్వలేదని చెప్పారు.
అయితే ఇదే విషయంపై బీసీసీఐ స్పందించింది. ఆసియన్ గేమ్స్ డెడ్‌లైన్‌కు ఒక రోజు ముందు తమకు ఐఓఏ (ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్) నుంచి మెయిల్ వచ్చిందని తెలిపింది. అప్పటికే ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్‌లో భాగంగా భారత క్రికెట్ పురుషుల, మహిళల జట్ల షెడ్యూల్ పూర్తైందని చెప్పింది. ఆసియన్ గేమ్స్ సమయంలో ముఖ్యమైన మ్యాచ్‌లు ఉన్నాయని వెల్లడించింది. ఫ్యూచర్ ప్రోగ్రామ్స్‌లో భాగంగా.. స్వదేశంలో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లో టీమ్ఇండియా జట్టు ఆడనుంది. ఆ సమయంలోనే మహిళల క్రికెట్ టీమ్ దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. ఆసియన్ గేమ్స్ కూడా ఈ టైమ్‌లోనే జరుగుతుండటం వల్ల బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.