BCCI Annual Awards : కొవిడ్ కారణంగా తాత్కాలికంగా ఆగిపోయిన బీసీసీఐ వార్షిక అవార్డుల ఫంక్షన్, దాదాపు మూడేళ్ల తర్వాత మరోసారి గ్రాండ్‌గా జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వేదికగా జనవరి 23న ఈ వేడుకను నిర్వహించేలా ఏర్పాట్లు మొదలుపెట్టారు. అట్టహాసంగా జరగనున్న ఈ వేడుకకు టీమ్ఇండియాతో పాటు ఇంగ్లాండ్ జట్టు ప్లేయర్లు హాజరుకానున్నారు. అయితే జనవరి 25 నుంచి ఉప్పల్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు జరగనుంది. అవార్డుల వేడుక సమయానికి ఇంగ్లాండ్ ఆటగాళ్లు హైదరాబాద్‌లోనే ఉండటం వల్ల వారిని కూడా వేడుకకు ఆహ్వానించనున్నారు.
తాజాగా బీసీసీఐ వార్షిక అవార్డుల ఫంక్షన్ గురించి బోర్డు సెక్రటరీ జైషా అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు ఓ లేఖ రాశారు. ''ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం దేశంలోని అత్యుత్తమ క్రికెటర్ల సక్సెస్ స్టోరీలను గుర్తించి వారిని గౌరవించే ఓ వేదిక. బీసీసీఐ వార్షిక అవార్డులకు మా గుండెల్లో ఎప్పటికీ ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది.అవి అద్భుతమైన క్రికెట్ పట్ల శ్రేష్ఠత, అంకితభావం, అభిరుచికి ప్రతీకలుగా నిలుస్తాయి. క్రికెట్ హీరోలను అందించడంలోనూ మీరు చేసిన సహకారానికి ఎంతో ధన్యవాదాలు'' అంటూ జైషా పేర్కొన్నాడు.
ఇక ముంబయి వేదికగా 2020 జనవరిలో చివరిసారిగా బీసీసీఐ అవార్డుల ఫంక్షన్ జరిగింది. అందులో 2018-19 క్రికెట్ ఏడాదికి గానూ అత్యుత్తమ ప్లేయర్లకు అవార్డులను అందజేసింది.పురుషుల జట్టులో జస్ప్రీత్ బుమ్రా, ఉమెన్స్ జట్టులో పూనమ్ యాదవ్ 2020లో పాలీ ఉమ్రిగర్ అవార్డు అందుకున్నారు. మరోవైపు మాజీ క్రికెటర్ సీకే నాయుడు పేరిట ఉన్న లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును కృష్ణమాచారి శ్రీకాంత్, అంజుమ్ చోప్రాకు అందించారు.