స్వదేశంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న సిరీస్‌లకు సంబంధించి బీసీసీఐ భారత జట్లను ప్రకటించింది. ఈ సిరీస్‌లకు సంబంధించి పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఉండగా తొలి రెండు టెస్టులకు సంబంధించి సెలక్షన్ కమిటీ ఆటగాళ్లను ప్రకటించింది. తొలిసారి స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లకు టెస్టు జట్టులోకి పిలుపు వచ్చింది.
ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన పృథ్వీ షా న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. వ్యక్తిగత కారణాలతో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ న్యూజిలాండ్ టీ20, వన్డే సిరీస్‌లకు దూరమయ్యారు. ఇక మరోసారి న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వం వహించనున్నాడు. యువ కీపర్ కేఎస్ భరత్ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు, ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. గాయంతో చాన్నాళ్ల పాటు క్రికెట్‌కు దూరంగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆస్ట్రేలియాతో రెండు టెస్ట్‌లకు ఎంపికయ్యాడు. అయితే ఫిట్‌నెస్‌ను బట్టి బరిలోకి దిగే అవకాశం ఉంది.
న్యూజిలాండ్‌తో భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. జనవరి 18 నుంచి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ మొదలు కానుంది. తొలి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా, ఈనెల 21న రాయ్‌పుర్, 24న ఇండోర్‌లో వన్డేలు జరగనున్నాయి. జనవరి 27 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. రాంచీ, లఖ్‌నవూ, అహ్మదాబాద్‌లో టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. నాగ్‌పుర్ వేదికగా ఆసీస్‌తో తొలి టెస్టు జరగనుంది.