BCCI Election Notification: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)లో ఎన్నికల సీజన్ వచ్చేసింది. బీసీసీఐ ఆఫీస్ బేరర్ల పదవుల ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ నోటిఫికేషన్‌ను పంపింది. బీసీసీఐ నోటిఫికేషన్ ప్రకారం.. రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఇచ్చేందుకు దరఖాస్తు దాఖలుకు సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 4వ తేదీ వరకు గడువునిచ్చింది. అక్టోబర్ 5వ తేదీన డ్రాఫ్ట్ ఎలక్ట్రోరల్ రోల్‌ను ప్రకటిస్తారు. అభ్యంతరాలను అక్టోబరు 6-7 తేదీల్లో సమర్పించాలి. అక్టోబర్ 10వ తేదీన అభ్యంతరాలను పరిశీలించి ఎలక్టోరల్ రోల్ తుది జాబితాను విడుదల చేస్తారు.
ఇక బీసీసీఐలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ పదవులకు ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రతినిధులు వీరిని ఎన్నుకుంటారు. అక్టోబర్ 11, 12 తేదీల్లో బీసీసీఐలోని కీలక పదవులకు పోటీ పడే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. నామినేషన్ల దరఖాస్తులను 13వ తేదీ స్క్రూటినీ చేసి.. అదే రోజు అర్హులైన అభ్యర్థులను ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 14వ తేదీ గడువు కాగా.. పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వెల్లడిస్తారు. 18వ తేదీ ఎన్నిక నిర్వహించి.. అదే రోజున ఫలితాలను ప్రకటించడం జరుగుతుంది.