బీసీసీఐ దేశవాళీ క్రికెట్‌లో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టనుంది. వచ్చే నెలలో ప్రారంభంకానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ నుంచి 'ఇంపాక్ట్ ప్లేయర్' అనే నిబంధనను అమల్లోకి తేనుంది. ఇది అమల్లోకి వస్తే ఇన్నింగ్స్ మధ్యలో ఆటగాడిని మార్చుకునే వెసులుబాటు లభిస్తుంది.
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం.. ఇన్నింగ్స్ ప్రారంభమయ్యాక 14 ఓవర్ల లోపు ఇరు జట్లు ఒక్కో ఆటగాడిని మార్చుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా మ్యాచ్ మధ్యలో ఆటగాడికి గాయమైనా లేక ఆనారోగ్యం బారిన పడినా అతడి స్థానంలో మరో ఆటగాడు సబ్‌స్టిట్యూట్ విధానం ద్వారా బరిలోకి దిగుతాడు. ఇక్కడ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఆటగాడు కేవలం ఫీల్డింగ్ చేయాల్సి ఉంటుంది. అదే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం అయితే బౌలింగ్ చేసే జట్టులో ఇన్నింగ్స్ 14 ఓవర్లలోపు ఆటగాడు గాయపడినా లేదా మ్యాచ్ అప్పటి స్థితిగతులను ఆధారంగా ఓ ఆటగాడిని మార్చుకోవాలని భావించినా ఓవర్ ముగిశాక కెప్టెన్, హెడ్ కోచ్, మేనేజర్‌లలో ఎవరో ఒకరు ఫీల్డ్ అంపైర్ లేదా ఫోర్త్ అంపైర్‌కు సమాచారం అందిస్తే ఆటగాడిని మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆటగాడు బ్యాటింగ్‌తో పాటు 4 ఓవర్ల పాటు బౌలింగ్ కూడా చేయవచ్చు.