Bangladesh Complaint ICC: బంగ్లాదేశ్- సౌతాఫ్రికా మధ్య డర్బన్‌లో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ప్రొటీస్ జట్టు గెలుపొందింది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 53 పరుగులకే ఆలౌటై దారుణ పరాజయాన్ని ఎదుర్కొంది. అయితే.. ఈ మ్యాచ్‌లో అంపైరింగ్ తప్పుడు నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ను(ఐసీసీ) ఆశ్రయించనున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) తెలిపింది. మైదానంలో తమ ఫిర్యాదులను కూడా అంపైర్లు పట్టించుకోలేదని బోర్డు ఆరోపించింది. వన్డే సిరీస్‌కు సంబంధించి ఇప్పటికే రాతపూర్వక ఫిర్యాదు చేసినట్లు బీసీబీ క్రికెట్ వ్యవహారాల హెడ్ జలాల్ యూనస్ వెల్లడించాడు. మ్యాచ్ అంపైర్లు.. బంగ్లాదేశ్ టీమ్ మేనేజర్ నఫీజ్ ఇక్బాల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని అన్నాడు. టెస్టు మ్యాచ్‌కు సంబంధించి కూడా ఇప్పుడు ఐసీసీకి అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు వివరించాడు.
''మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్.. మా మేనేజర్ నఫీజ్ ఇక్బాల్‌తో అనుచితంగా ప్రవర్తించాడు. మేం దీనిపై లిఖితపూర్వత ఫిర్యాదు చేశాం. ఇప్పుడు టెస్టు మ్యాచ్‌పై కూడా ఐసీసీకి వెళ్తాం. స్లెడ్జింగ్ రెండువైపులా ఉంది. కానీ ఎక్కడ మొదలైంది. అంపైరింగ్ తప్పుడు నిర్ణయాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావు. దీనిని మేం ఖండిస్తున్నాం. అంపైర్ల నిర్ణయాలను మేం అంగీకరిస్తాం. కానీ తటస్థ అంపైర్లను మళ్లీ తేవాల్సిందే.''
- జలాల్ యూనస్, బంగ్లా క్రికెట్ బోర్డు హెడ్