Tamim Iqbal Retirement : బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ మనసు మార్చుకున్నాడు. గురువారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్.. శుక్రవారం ఉపసంహరించుకున్నాడు. రిటైర్మెంట్ విషయమై తమీమ్ ఇక్బాల్ శుక్రవారం బంగ్లాదేశ్ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశారు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రధాని కోరినట్లు తమీమ్ ఇక్బాల్ మీడియాకు తెలిపాడు. ఈ మేరకు తమీమ్ మీడియాతో మాట్లాడాడు.
రిటైర్మెంట్ గురించి ఎవరు చెప్పినా వినబోనని.. కానీ ప్రధాని షేక్ హసీనా మాటలకు అభ్యంతరం చెప్పలేనని.. అందుకే రిటైర్మెంట్ ఉపసంహరించుకుంటున్నానని తమీమ్ అన్నాడు. నెలన్నర పాటు ఆటకు దూరంగా ఉండాలని బంగ్లాదేశ్ ప్రధాని తనను స్వయంగా కోరారని చెప్పాడు. అందుకే నెలన్నర పాటు ఆటకు దూరంగా ఉండాలనుకుంటున్నానని.. మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడే మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నా అని వివరించాడు.
తమీమ్ భావోద్వేగం..
గురువారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ భావోద్వేగానికి గురయ్యాడు. 16 ఏళ్ల తన క్రికెట్ కెరీర్లో తనక సపోర్ట్ చేసిన అభిమానులతో పాటు బంగ్లా క్రికెట్ బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ కంటతడి పెట్టుకున్నాడు. ఈ సందర్భంగా తమ జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సిన తరుణం వచ్చిందని వ్యాఖ్యానించాడు. తమీమ్ ఇక్బాల్ స్థానంలో కొత్త కెప్టెన్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇంకా ప్రకటించలేదు. అయితే మళ్లీ షకిబ్ అల్ హసన్‌కు గానీ లిటన్ దాస్‌కు కెప్టెన్సీ దక్కే అవకాశాలు ఉన్నాయి. బంగ్లా-అఫ్గానిస్థాన్ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే జులై 8న, మూడో వన్డే జులై 11న జరగనుంది.