శ్రీలంక ప్రీమియర్ లీగ్‌లో ఆటగాళ్లు వరుసగా గాయాల బారినపడుతున్నారు. లంక ప్లేయర్ చమిక కరుణరత్నే క్యాచ్ అందుకునే క్రమంలో పళ్లు రాళగొట్టుకున్న ఘటన మరవక ముందే.. మరో సంఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ యువ ఆటగాడు ఆజాం ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. క్యాండీ ఫాల్కన్స్, గల్లే గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఏం జరిగిందంటే?.. లంక ప్రీమియర్ లీగ్‌లో క్యాండీ ఫాల్కన్స్‌కు ఆజాం ఖాన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గాలే గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన నువాన్ ప్రదీప్.. మూడో బంతిని బాగా స్లోగా వేశాడు. అది వైడ్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో వికెట్ కీపింగ్ చేస్తున్న ఆజాం ఖాన్ బంతిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే బంతిని అంచానా వేయడంలో అజం విఫలమవ్వడంతో.. అది నేరుగా అతడి తలకి తాకింది. దీంతో నేలపై పడుకుని అతడు నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే ఫిజెయో వచ్చి అతడిని పరిశీలించాడు. అతడిని స్ట్రెక్చర్ పై బయటకు తీసుకెళ్లారు. అతడిని ఆసుపత్రికి తరలించిన వెంటనే స్కానింగ్ చేశారు. స్కాన్ రిపోర్టులు పరిశీలించిన వైద్యలు అతడు బాగానే ఉన్నాడని తెలిపారు. దీంతో పాక్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఆజాం ఖాన్ పాకిస్థాన్ దిగ్గజం మొయీన్ ఖాన్ తనయడు అన్న సంగతి తెలిసిందే.