బాన్‌క్రాఫ్ట్ వ్యాఖ్యలతో మళ్లీ చర్చనీయాంశమైన బాల్ ట్యాంపరింగ్ వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా నష్టనివారణకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. సాండ్‌గేట్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదంటూ వెనక్కి తగ్గాడు ఆసీస్ క్రికెటర్ బాన్‌క్రాఫ్ట్. ఆరోపణలు ఎదుర్కొంటున్న బౌలర్లూ... ఈ వ్యవహారానికి ఇక్కడితో ముగింపు పలకాలంటూ సంయుక్త ప్రకటన చేశారు.
ఇదీ చదవండి:బాల్ ట్యాంపరింగ్ రగడపై బాన్‌క్రాఫ్ట్ వెనకడుగు!
మాకేం తెలీదు..
బాల్ ట్యాంపరింగ్ వివాదంపై నాటి ఆస్ట్రేలియా జట్టులోని బౌలర్లు సంయుక్త ప్రకటన చేశారు. దాని గురించి తమకేమీ తెలియదని.. ఈ విషయానికి ఇంతటితో ముగింపు పలకాలని పేర్కొన్నారు.
"మా నిజాయితీ పట్ల మేము గర్వంగా ఉన్నాం. కానీ, ఇటీవల బాల్ ట్యాంపరింగ్ వివాదానికి సంబంధించి మమ్మల్ని తప్పుపట్టడం వల్ల కొంత బాధేసింది. మీడియాతో పాటు మాజీ ఆటగాళ్లు మమ్మల్ని ప్రశ్నించడం బాధాకరం. నాటి సంఘటనకు సంబంధించి ఏం జరిగిందో తెలియజేయాలని మాపై ఒత్తిడి చేస్తున్నారు. కానీ, అప్పుడు మైదానంలో ఏం జరిగిందో మాకేమీ తెలీదు" అని నలుగురు బౌలర్లు సంయుక్త ప్రకటన చేశారు.
2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో కమిన్స్, హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, నాథన్ లయాన్.. నాటి ఆస్ట్రేలియా జట్టులో ఉన్నారు.
ఇదీ చదవండి:'బాల్ టాంపరింగ్ వివాదంపై వార్నర్ బుక్ రాయాలి'
2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఆసీస్ బ్యాట్స్‌మన్ కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ బంతికి ఉప్పుకాగితం రుద్దుతూ అడ్డంగా దొరికాడు. ఈ విషయాన్ని ఫీల్డ్ అంపైర్లు గమనించారు. ఇందులో కెప్టెన్ స్మిత్‌తో పాటు వైస్ కెప్టెన్ వార్నర్ పాత్ర ఉన్నట్లు తేలింది. వీరిద్దరినీ క్రికెట్ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేయగా.. ప్రధాన సూత్రధారి బాన్‌క్రాఫ్ట్‌ను తొమ్మిది నెలలు ఆటకు దూరం చేశారు. అయితే ఈ విషయంపై బౌలర్లందరికీ ముందే సమాచారముందని బాన్‌క్రాఫ్ట్ ఇటీవల తెలిపాడు.