BAN vs SL world cup 2023 :2023 ప్రపంచకప్ నుంచి శ్రీలంక దాదాపు నిష్ర్కమించింది. సోమవారం దిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక ఓడింది. శ్రీలంక నిర్దేశించిన 280 పరుగుల టార్గెట్‌ను.. బంగ్లాదేశ్ 41.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ హోసన్ శాంటో (90), కెప్టెన్ షకీబల్ హసన్ (82) హాఫ్ సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక 3, మహీశ్ తీక్షణ 2, ఏంజిలో మాథ్యూస్ 2 వికెట్లు దక్కించుకున్నారు. కీలక ఇన్నింగ్స్‌తో రాణించిన షకీబల్ హసన్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
280 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్.. ఆరంభంలోనే తన్జీద్ హసన్ (9), లిట్టన్ దాస్ (23) ఓపెనర్లిద్దరిని కోల్పోయింది. ఈ దశలో నజ్ముల్ హోసన్ శాంటో, షకీబల్ హసన్ అద్భుతంగా పోరాడారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 168 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో బంగ్లా విజయం దాదాపు ఖరారైంది. కానీ వీరిద్దరూ వరుస ఓవర్లలో ఔటవ్వడం వల్ల.. బంగ్లాదేశ్ ఒత్తిడిలో పడ్డట్లు కనిపించింది. కానీ, మహ్మదుల్లా (22) విలువైన పరుగులు చేశాడు. చివర్లో టౌహిద్ హ్రిదయ్ (15 పరుగులు 7 బంతుల్లో) జట్టును విజయతీరాలకు చేర్చాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగులు చేసి ఆలౌటైంది. అసలంక (108 పరుగులు, 105 బంతుల్లో) శతకంతో చెలరేగాడు. ఇక ఓపెనర్ పాతుమ్ నిస్సంకా (41 పరుగులు), సదీర సమరవిక్రమ (41), ధనంజయ డి సిల్వా (34) రాణించారు. బంగ్లా బౌలర్లలో తంజీమ్ హసన్ షకిబ్ 3, షకిబల్ హసన్ 2, ఇస్లామ్ 2, మెహిదీ హసన్ మిర్జా ఒక వికెట్ దక్కించుకున్నారు..