Ban VS Nz Test: లాంఛనం ముగిసింది. న్యూజిలాండ్ లెక్క సమం చేసింది. రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసి తొలి మ్యాచ్‌లో పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం ముగిసిన మ్యాచ్‌లో కివీస్ ఇన్నింగ్స్, 117 పరుగుల ఆధిక్యంతో బంగ్లాపై విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. సోమవారం తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగులకే కుప్పకూలిన బంగ్లాను మూడో రోజు కివీస్ ఫాలోఆన్ ఆడించింది. మంగళవారం ఉదయం ఆట ఆరంభించిన బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 79.3 ఓవర్లలో 278 పరుగులకు ఆలౌటైంది.
లిటన్ దాస్ (102; 114 బంతుల్లో 14×4, 1×6) పోరాడినా ఫలితం లేకపోయింది. కివీస్ బౌలర్లు జేమీసన్ (4/82), నీల్ వాగ్నర్ (3/77)లు బంగ్లా పతనాన్ని శాసించారు.
వీడ్కోలు వీరుడికి చివరి వికెట్:
కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతున్న రాస్ టేలర్ (1/0) వికెట్‌తో వీడ్కోలు పలకడం విశేషం. చివర్లో వెలుతురు మందగించడంతో ప్రేక్షకుల కోరిక మేరకు కెప్టెన్ టామ్ లేథమ్.. టేలర్‌కు బంతినిచ్చాడు. టేలర్ వేసిన మూడో డెలివరీని ఎబాదత్ హొస్సేన్ (4) భారీ షాట్‌కు ప్రయత్నించగా.. గాల్లోకి లేచిన బంతిని లేథమ్ ఒడిసి పట్టుకున్నాడు. అంతే.. టేలర్ 15 ఏళ్ల టెస్టు కెరీర్‌కు శుభం కార్డు పడింది. టెస్టు కెరీర్‌లో చివరి మ్యాచ్‌ను వికెట్‌తో టేలర్ చిరస్మరణీయం చేసుకున్నాడు.