పై చిత్రం చూశారా.. బంతి వికెట్లను తాకుతున్నట్లుగా ఉంది కదా.. బ్యాటర్ ఔటైనట్లు అనుకోకండే.. ఎందుకంటే బంతి వికెట్లను తాకినా బెయిల్స్ పడకపోవడంతో బ్యాటర్ నాటౌట్‌గా నిలిచిన సంఘటనకు ప్రత్యక్ష సాక్ష్యం.. ఇంతకీ ఎవరంటారా..? ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ స్టోక్స్ ఇలానే బతికిపోయాడు.. ఈ ఘటన మీద మన క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారడం.. షేన్‌వార్న్, రికీ పాటింగ్ సహా క్రికెట్ అభిమానులు స్పందిచడం చకచకా జరిగిపోయాయి. యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్ కామెరూన్ గ్రీన్ 142 కి.మీ వేగంతో సంధించిన బంతి వికెట్లను తాకుతూ వెళ్లినా బెయిల్స్ మాత్రం కిందపడలేదు. అప్పుడు క్రీజ్‌లో బెన్ స్టోక్స్ క్రీజ్‌లో ఉన్నాడు. రిప్లేలో చూసుకున్న స్టోక్స్ బతికిపోయాను రా... జీవుడా అంటూ నవ్వకోగా.. పాపం ఆస్ట్రేలియా ఆటగాళ్లు వికెట్ దక్కకపోవడంతో ఖంగు తిన్నారు. దీంతో బౌలర్లకు అనుకూలంగా కొత్త చట్టం తీసుకురావాలని సచిన్ పేర్కొనగా.. క్రికెట్ కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని షేన్ వార్న్ బదులిచ్చాడు.
2019 వన్డే ప్రపంచకప్‌లో ఐదుసార్లు ఇలానే..
గత వన్డే ప్రపంచకప్‌లో ఐదుసార్లు ఇదే విధంగా బెయిల్స్ కిందపడకపోవడంతో బ్యాటర్లు బతికిపోయిన సంఘటనలు జరిగాయి. అందులో టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచూ ఉంది. ఛేదనకు దిగిన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అప్పటికి ఒకే ఒక్క పరుగుతో క్రీజ్‌లో ఉన్నాడు. భారత ఫాస్ట్‌బౌలర్ బుమ్రా వేసిన బంతి వార్నర్ బ్యాట్‌ను ముద్దాడుతూ బూట్ మీదుగా వెళ్లి వికెట్లను తాకింది. స్టంప్స్ నుంచి లైట్లు వెలిగినా బెయిల్స్ కిందకు పడకపోవడంతో వార్నర్‌ను ఔట్‌గా ప్రకటించలేదు అంపైర్లు. ఆ మ్యాచ్‌లో వార్నర్ (56) అర్ధశతకం సాధించినా ఆస్ట్రేలియా విజయం సాధించలేదు. దీంతో ఈ వ్యవహారంపై అప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగింది.
*ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా:ఇంగ్లాండ్ బౌలర్ అదిల్ రషీద్ బౌలింగ్‌లో క్వింటన్ డికాక్ బ్యాటింగ్ చేస్తున్నాడు. రషీద్ వేసిన బంతిని స్వీప్ షాట్ కొట్టేందుకు డికాక్ మిస్ అయిపోయి లెగ్ స్టంప్‌ను తాకింది. అయితే బెయిల్స్ కింద పడకపోవడం.. అది బౌండరీ వెళ్లిపోవడంతో డికాక్ బతికిపోయాడు. అర్ధశతకం (68) బాదినా జట్టును మాత్రం గెలిపించుకోలేకపోయాడు.
*బంగ్లాదేశ్ vs ఇంగ్లాండ్ : బంగ్లాదేశ్ బ్యాటర్‌కు అదృష్టం వెనుకనే దురదృష్టం ఉందేమో.. ఇంగ్లాండ్ బౌలర్ బెన్ స్టోక్స్ ఓవర్‌లో ఒకసారి బెయిల్ కింద పడకపోవడంతో తప్పించుకున్న సైఫుద్దీన్.. ఆ వెంటనే తర్వాతి బంతికే క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ముందు బంతిని వికెట్లను తాకినట్లు లైట్లు వెలిగినా బెయిల్స్ పడలేదు. దీంతో జీవదానం లభించినా సైఫుద్దీన్ వినియోగించుకోలేకపోయాడు.
* కివీస్ vs శ్రీలంక: ఈసారి శ్రీలంక కెప్టెన్‌కు అదృష్టం కలిసొచ్చింది. దిముత్ కరుణరత్నె 9 పరుగుల వద్ద ఉన్నప్పుడు న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌కు వచ్చాడు. మంచి బంతిని సంధించినా దురదృష్టం కొద్దీ వికెట్ మాత్రం దక్కలేదు. బంతి వికెట్లను తాకినా బెయిల్స్ కింద పడకపోవడంతో కరుణరత్నెను అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించారు. అయితే ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుదే విజయం.