Bajrang Punia Padma Shri Return : భారత స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియా అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు తెలిపాడు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాడు. డబ్ల్యూఎఫ్ఐ నూతన అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికవడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బజ్రంగ్ లేఖలో పేర్కొన్నాడు.
'ప్రియమైన ప్రధాని, మీరు మీ పనుల్లో చాలా బిజీగా ఉంటారు. అయినప్పటికీ మీ దృష్టిని దేశంలోని రెజ్లర్లపైకి తీసుకురావడానికి నేను ఈ లేఖ రాస్తున్నాను. డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ లైగింక వేధింపుల వల్ల అతడికి వ్యతిరేకంగా దేశంలోని మహిళా రెజ్లర్లు ఈ ఏడాది జనవరిలో నిరసన చేసిన విషయం మీకు తెలిసే ఉంటుంది. నేనూ ఆ నిరసనలో పాల్గొన్నా. అతడిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాతే ఆ నిరసన విరమించాం. కానీ, మూడు నెలలు గడిచినా అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మేము మళ్లీ ఏప్రిలో రోడ్డెక్కాం. దీంతో 19 కేసులకుగాను అతడిపై కేవలం 7 కేసులు నమోదయ్యాయి. అంటే బ్రిజ్ భుషణ్ తన పలుకుబడితో 12మంది మహిళా రెజ్లర్లను భయపెట్టి ఉంటాడు' అని బజ్రంగ్ లేఖలో పేర్కొన్నాడు.
'మా నిరసన 40 రోజులు సాగింది. ఆ సమయంలో మాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఓ సమయంలో మేము సాధించిన పతకాలను గంగా నదిలో కలిపేద్దామని డిసైడ్ అయ్యాం. కానీ, ప్రభుత్వం మాకు అండగా నిలుస్తుందని, అతడిపై చర్యలు ఉంటాయని హామీ ఇచ్చిన తర్వాత మా నిర్ణయం మార్చుకున్నాం. ఇక నిన్న (డిసెంబర్ 21)న జరిగిన డబ్లూఎఫ్ఐ ఎన్నికల ఫలితాలు చూస్తే, మళ్లీ రెజ్లింగ్ ఫెడరేషన్ బ్రిజ్ భూషణ్ చేతుల్లోకే వెళ్లిన్నట్లు అనిపిస్తుంది. ఏం చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు. ఎక్కడికి వెళ్లాలో తెలియట్లేదు. మాకు ప్రభుత్వం ఎంతో ఇచ్చింది. 2019లో నన్ను పద్మశ్రీతో సత్కరించింది. నేను అర్జునా అవార్డు, ఖేల్రత్న కూడా పొందాను. కానీ, మహిళా రెజ్లర్లు భద్రత లేని కారణంగా ఆటను వదిలేయాల్సి వస్తోంది. అయితే మహిళా రెజ్లర్లు అవమానాలు ఎదుర్కొంటున్న సమయంలో, ఓ పద్మశ్రీ అవార్డు గ్రహీతగా నేను బతకలేను. అందుకే నేను అవార్డు మీకు ఇచ్చేస్తున్నా' అని బజ్రంగ్ లేఖలో తన ఆవేదన వ్యక్తం చేశాడు.