Bairstow Sledging Ashes 2023 : ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో వివాదాల వెల్లువ ఆ దేశ ప్రధానుల వరకు చేరగా.. తాజాగా జరిగిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా మరో వివాదస్పద ఘటన జరిగింది. ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో మధ్య ఓ చిన్నపాటి మాటల యుద్ధం సాగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో.. స్టీవ్ స్మిత్‌ను మొయిన్ అలీ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ సమయంలో మొయిన్ అలీ వేసిన 28వ ఓవర్ నాలుగో బంతిని స్మిత్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు.. కానీ అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న బెన్ డకెట్ ఈ బాల్‌ను సునాయసంగా అందుకున్నాడు. మొకాలి ఎత్తులో వచ్చిన ఆ క్యాచ్‌ను ఎలాంటి తప్పిదం చేయకుండా ఇట్టే పట్టుకున్నాడు. ఇక స్మిత్ షాట్ ఆడగానే క్యాచ్ అని గట్టిగా అరిచిన బెయిర్ స్టో... ఔటవ్వగానే 'పోరా.. మళ్లీ కలుద్దాం'అంటూ కామెంట్ చేశాడు.
Smith Bairstow Sledging Video : అప్పటికే చెత్త షాట్ ఆడానని అసహనంతో వెనుదిరుగుతున్న స్మిత్‌కు బెయిర్ స్టో మాటలు మరింత ఆగ్రహం తెప్పించాయి. దీంతో 'ఏం.. ఏమో అంటున్నావ్?'అంటూ గట్టిగా అరిచాడు. దానికి బెయిర్ స్టో.. 'నేను ఏమన్నాను.. ఔటైనందుకు ఛీర్స్ చెబుతూ మళ్లీ కలుద్దామని అన్నాను'.. అంటూ బదులిచ్చాడు. దీంతో వారిద్దరి మధ్య వాడీ వేడీ చర్చ కొనసాగించింది.
ఇక లార్డ్స్ టెస్ట్‌లో బెయిర్ స్టో స్టంపౌట్‌పై వివాదం చెలరేగడం.. ఆసీస్ అడ్డదారిలో విజయం సాధించిందని ఇంగ్లాండ్ ఆరోపిస్తుండటం ఇరు జట్ల మధ్య కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనేలా చేశాయి. విజయమే లక్ష్యంగా ఇరు జట్లు కసిగా ఆడుతుండటం వల్ల అక్కడ జరిగే ప్రతీ చిన్న విషయం కూడా పెద్ద వాగ్వాదానికి దారితీస్తోంది.
Ashes 2023 : ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 116/4తో నిలిచిన ఆసీస్ జట్టు.. ప్రస్తుతం 142 పరుగుల ఆధిక్యంలో ముందంజలో ఉంది. క్రీజులో ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ ఉన్నారు. ఇక అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 68/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ టీమ్.. ప్యాట్ కమిన్స్ (6/91) దెబ్బకు 237 పరుగులకే కుప్పకూలిపోయింది. మరోవైపు కెప్టెన్ బెన్ స్టోక్స్ .. ఒంటరి పోరాటంతో జట్టును ఆదుకోవడం వల్ల స్కోర్ బోర్డ్‌లో పరుగుల వరద పారింది. అయితే మిగతా మూడు రోజుల ఆటలో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నందున రానున్న మ్యాచ్ మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.