Babar Azam Resigns As Captain :పాకిస్థాన్ క్రికెట్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ బాబర్ అజామ్.. సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్థాన్ కెప్టెన్సీకి అతడు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. ఇకపై మూడు ఫార్మాట్లలో ప్లేయర్‌గా మాత్రమే కొనసాగనున్నట్లు చెప్పాడు. ఈ మేరకు బాబర్ ఎక్స్ (ట్టిట్టర్) వేదికగా ప్రకటన విడుదల చేశాడు.
'జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నుంచి 2019లో పిలుపు వచ్చింది. అది నాకు ఇంకా గుర్తుంది. గడిచిన 4 ఏళ్లుగా ఫీల్డ్ లోపల, బయటా అనేక ఎత్తుపల్లాలు చూశాను. క్రికెట్ ప్రపంచంలో పాకిస్థాన్ గౌరవాన్ని నిలబెట్టాలని నిజాయితిగా ప్రయత్నించాను. అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా. ఇది కఠినమైన నిర్ణయమే.. అయినా ఇందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నా. తదుపరి కెప్టెన్‌కు, జట్టుకు అన్ని విధాలుగా సహకరిస్తాను' అని బాబర్ అజామ్ ట్విటర్‌లో రాసుకొచ్చాడు.
Pakistan World Cup 2023 Performance: ఈ మెగాటోర్నీలో పాక్.. ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడిన పాక్.. కేవలం నాలుగింట్లో విజయం సాధించింది. దీంతో సెమీస్ చేరకుండానే పాక్ ఇంటిబాట పట్టింది. అయితే బాబర్ ఇంగ్లాండ్‌తో మ్యాచ్ అనంతరమే రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ పలు కథనాలు వెలువడ్డాయి.