Babar Azam Moves Sachin: ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్.. పలు రికార్డుల్ని తన ఖాతాలో వేసుకుంటున్నాడు. వన్డే, టీ-20ల్లో వరల్డ్ నెం.1గా ఉన్న పాక్ సారథి.. తాజాగా ఆల్‌టైమ్ వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో రేటింగ్ పాయింట్లను పెంచుకున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్‌ను అధిగమించి 15వ స్థానంలో నిలిచాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు బాబర్. ఇదే క్రమంలో ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని మరింత పదిలపర్చుకున్నాడు.
బాబర్ ఇదే రీతిలో ఆడితే.. ఆల్‌టైమ్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ అత్యధిక రేటింగ్ పాయింట్ల జాబితాలో టాప్-10లోకి దూసుకెళ్లే అవకాశముందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. సచిన్ 887 రేటింగ్ పాయింట్లతో ఇప్పుడు 16వ స్థానానికి పడిపోయాడు. బాబర్ అజామ్‌కు ప్రస్తుతం 891 పాయింట్లు ఉన్నాయి. ఈ లిస్ట్‌లో వెస్టిండీస్ మాజీ దిగ్గజ బ్యాటర్ సర్ వివ్ రిచర్డ్స్ 935 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. టాప్-10లో ఉన్న ఏకైక భారత ఆటగాడు విరాట్ కోహ్లీనే. విరాట్ 911 రేటింగ్ పాయింట్లతో ఆరో ప్లేస్‌లో ఉన్నాడు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో ముందుంది కోహ్లీనే కావడం విశేషం.