Axar Patel World Cup 2023 :గత మూడేళ్ల నుంచి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్సర్ పటేల్.. టీమ్ఇండియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఫ్లాట్ ట్రాక్స్ మీద ఎన్నో అద్భుతాలు చేశాడు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ స్పిన్ ఆల్‌రౌండర్.. గత కొద్ది కాలంగా వన్డేల్లో సరైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అయినప్పటికీ అతడిపై జట్టులో ఆశలు ఉన్నాయి. అయితే ఆసియా కప్ 2023లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు గాయపడ్డాడు. అనంతరం ఆ గాయం నుంచి కోలుకోలేక.. ప్రపంచ కప్ జట్టులో చోటు కోల్పోయాడు. దీంతో అతడి స్థానంలో అనూహ్యంగా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి వచ్చాడు.
అయితే తాజాగా అక్సర్ పటేల్.. వన్డే ప్రపంచకప్ జట్టుకు దూరమవ్వడంపై అతడి సోదరుడు సంషిప్ పటేల్ ఈటీవీ భారత్‌తో ఎక్స్లూజివ్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. అక్సర్ పటేల్ ఆల్ రౌండర్‌గా తనను తాను నిరూపించుకునేందుకు.. 2023 వరల్డ్ కప్ గోల్డెన్ అవకాశం అని అన్నాడు. ఆసియా కప్‌లో బ్యాట్‌తో, బంతితో తన వంతుగా మంచిగా రాణించేందుకు ప్రయత్నించాడని పేర్కొన్నాడు. కానీ కాలికి గాయం అవ్వడం వల్ల ప్రస్తుతం అతడు బెంగళూరులో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపాడు. "అక్సర్ 2015 వరల్డ్ కప్ కోసం సెలెక్ట్ అయినప్పటికీ మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు గాయం వల్ల అతడు ఈ ప్రపంచ కప్‌కు దూరమవ్వడం మమ్మల్ని బాధ పెట్టింది. అతడు త్వరలోనే కోలుకుని మళ్లీ ఆడతాడని ఆశిస్తున్నాం" అని పేర్కొన్నాడు.