స్వలింగ వివాహంతో ఒక్కటైన ఆసీస్ మహిళా క్రికెటర్ మేగాన్ స్కట్- జెస్ హోలియోక్ జంటకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఎమర్జెన్సీ సీ- సెక్షన్ పద్ధతిలో ఆగస్టు 17న చిన్నారి పుట్టినట్లు స్కట్ ట్విట్టర్లో వెల్లడించింది. రిలీ లూయిస్ స్కట్ అనే పాపకు పేరు పెట్టినట్లు చెప్పింది. ఆ పాప 858 గ్రాముల బరువు ఉన్నట్లు పేర్కొంది. ఆ చిన్నారితో తీసుకున్న పలు ఫొటోలను షేర్ చేసింది.
"ఎమర్జెన్సీ సీ- సెక్షన్ ద్వారా మాకు పాప పుట్టింది. దీంతో 28 వారాల మా నిరీక్షణకు తెరపడింది. నా జీవితంలో ఈ ఇద్దరు అందమైన అమ్మాయిలు ఉండడం నా అదృష్టం" అని మేగాన్ ట్విట్టర్లో పేర్కొంది.
ఆస్ట్రేలియాలో కొన్నేళ్ల క్రితం స్వలింగ వివాహాలు చట్టబద్దం చేశారు. దీంతో ఈ జంట 2019 మార్చిలో మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది. 2021 మేలో తన భార్య గర్భం దాల్చినట్లు మేగాన్ ప్రకటించింది. నవంబర్లో తమ కుటుంబంలోకి మూడో వ్యక్తి రాబోతున్నట్లు వెల్లడించింది.