Nathan Lyon Injury : లండన్‌లోని లార్డ్స్ వేదికగా యాషెస్ సిరీస్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. ఇందులో భాగంగా జరిగిన రెండో టెస్టులో ఆసీస్ టాప్ స్పిన్నర్ నాథన్ లైయన్ తీవ్ర గాయంతో బాధపడుతూ కనిపించాడు. అయినప్పటికీ నొప్పిని భరిస్తూ జట్టు కోసం నిర్విరామంగా బ్యాటింగ్ చేసి అందరిని ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లతో స్టేడియంలోని అభిమానులు.. లయన్‌కు స్టాండింగ్ ఒవేషన్ ఇస్తూ.. చప్పట్లతో ప్రశంసించారు. అయితే, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సెన్ మాత్రం ఈ విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో నాథన్ లైయన్ బ్యాటింగ్ రావడానికి గల ప్రధాన కారణం 'కంకషన్ సబ్‌స్టిట్యూట్'గా మరొకరిని తీసుకోవడానికే అన్నట్లుగా పీటర్సన్ వ్యాఖ్యానించాడు. దీంతో కెవిన్ వ్యాఖ్యలపై నాథన్ స్పందించాడు. ఈ సందర్భంగా ఆసీస్ బ్యాటర్ ఫిల్ హ్యూస్ ఉదంతాన్ని గుర్తు చేశాడు.
Nathan Lyon Ashes 2023 : "టెస్ట్ క్రికెట్ ఎప్పటి నుంచో ఉంది. గాయాలు కూడా ఆటలో ఓ భాగమే. నేను అలా బ్యాటింగ్‌కు రావడంపై కొన్ని కామెంట్లు విన్నాను. తలకు బంతిని తగలించుకోవడానికే క్రీజ్‌లోకి వెళ్లినట్లుగా కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి. వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇలా తలకు బంతి తగిలి నా సహచరుడిని (ఫిల్ హ్యూస్) కోల్పోయాను. ఈ సమయంలో అలాంటి సంభాషణ పేలవమైందిగా భావిస్తున్నాను. కంకషన్ కోసం ప్రయత్నించడమనేది చాలా రిస్క్‌తో కూడుకున్న పని. తలకు గాయమైతేనే అలాంటి అవకాశం మనకు వస్తుంది. దీని వల్ల ప్రాణాలకూ ముప్పు ఉంటుంది. అదృష్టవశాత్తూ నాకు అలాంటి గాయమైతే కాలేదు కాబట్టి నేను సంతోషంగానే ఉన్నాను" అని లైయన్ తెలిపాడు.