స్వదేశంలో ఆస్ట్రేలియా మహిళలతో జరగనున్న టీ20 సిరీస్‌కు రంగం సిద్ధమైంది. తాజాగా 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది సెలక్షన్ కమిటీ. ఈ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. కాగా, ఈ హోమ్ సిరీస్‌కు స్టార్ ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ గాయం కారణంగా దూరమైంది. అయితే ఆ జట్టులో కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అంజలి శర్వాణి ఎంపికైంది. టీమ్ ఇండియాకు అంజలి శర్వాణి ఎంపిక పట్ల ఆదోని ప్రాంతంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె కుటుంబసభ్యులకు స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. అంజలి తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడు కాగా.. తల్లి గృహిణి. స్థానిక మిల్టన్ ఉన్నత పాఠశాలలో అంజలి పదోతరగతి వరకు చదివింది. ఆ తర్వాత క్రికెట్‌పై ఆమెకున్న ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు.. ఆ రంగంలో ప్రోత్సహించారు. దీంతో క్రికెట్ వైపు అడుగులు వేసిన అంజలి.. అంచలంచెలుగా ఎదిగి భారత జట్టుకు ఎంపికైంది.
ఇక ఈ స్వదేశీ సిరీస్‌లో భాగంగా భారత జట్టు.. ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 9న ముంబయి వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ తమ జట్టును ప్రకటిచింది.