ఆస్ట్రేలియన్ వుమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్ ఫైనల్ మ్యాచ్.. ఎంతో ఉత్కంఠగా సాగింది. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆసక్తికర పరిణామాలు జరిగాయి. అనూహ్య మలుపులు తిరిగి.. క్రికెట్లోని అసలుసిసలు మజాను ప్రేక్షకులు ఆస్వాదించారు. అసలేం జరిగిందంటే?
లీగ్లో భాగంగా ఆస్ట్రేలియా, టాస్మానియా జట్లు.. ఫైనల్కు చేరుకున్నాయి. హోబర్ట్ వేదికగా శుక్రవారం రాత్రి ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టాస్మానియా జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను డక్వర్త్ లాయిస్ పద్ధతిలో 47 ఓవర్లకు కుదించారు. సౌత్ ఆస్ట్రేలియాకు 243 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
అయితే మ్యాచ్ చివరి నిమిషం వరకు సౌత్ ఆస్ట్రేలియా జట్టు గెలుపు దిశగా దూసుకెళ్లింది. ఆఖరి ఓవర్‌లో సౌత్ ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే కేవలం నాలుగు పరుగులే చేయాలి. వికెట్లు కూడా ఐదు ఉన్నాయి. అంతా సౌత్ ఆస్ట్రేలియాదే విజయం అని ఫిక్స్ అయ్యారు. ఇక్కడే మ్యాచ్ అనూహ్యంగా మలుపు తిరిగింది.
సౌత్ ఆస్ట్రేలియా జట్టు చివరి ఓవర్‌లో 5 వికెట్లు కోల్పోయి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసింది. ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. టాస్మానియా బౌలర్ కోయటే ఆఖరి ఓవర్‌లో మ్యాజిక్ చేసింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. మరో రెండు రనౌట్లు చేసి తన జట్టును వరుసగా రెండో ఏడాది ఛాంపియన్‌గా నిలబెట్టింది. ఈ నేపథ్యంలో మ్యాచ్కు సంబంధించిన హైలెట్స్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.