ఎన్ని వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడినా.. కెరీర్‌లో ఒక్కసారైనా టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాలనేది ప్రతి ఆటగాడి కల. ఇక భారత్-పాకిస్థాన్, భారత్-ఆస్ట్రేలియా, భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే ఏ మ్యాచ్ అయినా సరే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. కొన్నేళ్లుగా అడపాదడపా ఐసీసీ టోర్నీల్లో తలపడటం మినహా టీమ్‌ఇండియా, పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేనేలేవు. ఆసీస్, ఇంగ్లాండ్‌ను వారి గడ్డపైనే ఓడించి మరీ భారత్ తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటింది. ఇక మన మైదానాల్లో అయితే టీమ్‌ఇండియాకు తిరుగే ఉండదు.
ఈ క్రమంలో మన దేశంలోనే భారత్‌ను ఆస్ట్రేలియా ఓడించాలని.. ఆ జట్టులో తాను ఉండాలని కోరుకుంటున్నాడు ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్. షెడ్యూల్ ప్రకారం అయితే గత అక్టోబర్‌లోనే ఆసీస్ పర్యటన ఉండాల్సింది. అయితే ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ ఉండటం వల్ల పర్యటనను బీసీసీఐ వాయిదా వేసింది.
భవిష్యత్తులో తన లక్ష్యం గురించి నాథన్ లియోన్ మాట్లాడుతూ.. "భారత్‌పై వారి గడ్డమీదే ఆసీస్ గెలవాలి. ఆ జట్టులో నేను సభ్యుడిని కావాలి. ఇదే నాకున్న అతిపెద్ద లక్ష్యాల్లో ఒకటి. టెస్టు సిరీస్‌లో నేను కీలక పాత్ర పోషిస్తాననే నమ్మకం ఉంది" అని స్పష్టం చేశాడు.