Australia vs Sri Lanka World Cup 2023 :2023 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ఎట్టకేలకు బోణీ కొట్టింది. సోమవారం లఖ్‌నవూ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఆసీస్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. 43.3 ఓవర్లలో 209 పరుగుకు ఆలౌటైంది. ఇక లంక నిర్దేశించిన 210 పరుగుల టార్గెట్‌ను ఆసీస్.. 35.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ మిచెల్ మార్ష్ (52), జోష్ ఇంగ్లిస్ (58) అర్ధ శతకాలతో చెలరేగగా.. లబుషేన్ (40), మ్యాక్స్‌వెల్ (31*) రాణించారు. చివర్లో మార్కస్ స్టోయినిస్ (20 పరుగులు, 10 బంతుల్లో : 2x4, 1x6) దూకుడుగా ఆడాడు. లంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక 3, వెల్లలాగె 1 వికెట్ పడగొట్టారు. ఇక 4 వికెట్లతో రాణించి లంక బ్యాటర్లకు కళ్లెం వేసిన ఆసీస్ బౌలర్ ఆడమ్ జంపాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
ఆరంభం అదిరినప్పటికీ.. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఘనమైన ఆరంభం దక్కింది. ఓపెనర్లు పాతమ్ నిస్సంకా (61 పరుగులు, 67 బంతుల్లో : 8x4), కుశాల్ పెరీరా (78 పరుగులు, 82 బంతుల్లో : 12x4) హాఫ్ సెంచరీలతో రాణించారు. వీరిద్దరూ ఎక్కడా కూడా రన్‌రేట్ 6కు తగ్గకుండా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరి జోరు చూశాకా.. శ్రీలంక ఈజీగా 300+ స్కోర్ సాధిస్తుంది అని అంతా అనుకున్నారు. 21.4 ఓవర్ వద్ద ఆసీస్ పేస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ఈ జోడీని విడగొట్టాడు. దీంతో 125 పరుగుల భాగస్వామ్యానికి తెర దించాడు. తర్వాత కాసేపటికి కుశాల్ పెరీరా కూడా పెవిలియన్ బాట పట్టాడు. అతడ్ని సైతం కమిన్సే ఔట్ చేశాడు.
52 పరుగులకే 8 వికెట్లు..ఓపెనర్లు ఔటయ్యాక లంక ఇన్నింగ్స్ గాడీ తప్పింది. వారి ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు. లంక చివరి 8 వికెట్లకు 52 పరుగులే చేసింది. ఆసీస్ బౌలర్ల ధాటికి ఎవరూ నిలబడలేకపోయారు. ఓపెనర్లు మినహా అసలంక (25 పరుగులు) ఒక్కడే రెండంకెల స్కోర్ సాధించాడు. ఆసీస్ బౌలర్లలో జంపా 4, మిచెల్ స్టార్క్ 2, కమిన్స్ 2, మ్యాక్స్‌వెల్ 1 వికెట్ పడగొట్టారు..