ఆస్ట్రేలియా పర్యటన(australia tour of india) తర్వాత తన వైఖరి పూర్తిగా మారిపోయిందని టీమ్‌ఇండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్(Siraj) అన్నాడు. తనలో ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యిందని తెలిపాడు. జట్టులో ఎంతోమంది అద్భుతమైన పేసర్లు ఉన్నారని.. తమ మధ్య అత్యంత ఆరోగ్యకరమైన పోటీ ఉందని పేర్కొన్నాడు. సీనియర్లు తనకు విలువైన సలహాలు ఇస్తున్నారని వెల్లడించాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC final) చోటు దొరుకుతుందో లేదో తెలియదన్నాడు.
"ఆస్ట్రేలియా పర్యటన నా కెరీర్లోనే అత్యుత్తమ సందర్భం. అది నన్నెంతో మార్చింది. బౌలింగ్ పట్ల పూర్తిగా నా వైఖరిని మార్చేసింది. ప్రస్తుత భారత జట్టులో భాగమవ్వడం గొప్ప అనుభూతి. స్వదేశమైనా విదేశమైనా.. ఎక్కడైనా టీమ్‌ఇండియా ఎవరినైనా ఓడించగలదు. ఇలాంటి పటిష్ఠమైన జట్టులో చోటుకోసం పోటీ ఉండటం వ్యక్తిగతంగా నేను ఆస్వాదిస్తున్నా. సీనియర్లంతా చాలా మంచివారు. విలువైన సలహాలు ఇస్తుంటారు. పేస్ బౌలింగ్ కళ నేర్చుకొనేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో చోటు దొరుకుతుందో లేదో నిజంగా నాకు తెలియదు. మెరుగ్గా బౌలింగ్ చేసేందుకు, అవకాశం దొరికితే ఆడేందుకు సిద్ధంగా ఉన్నా."