Australia Cricket Neck Guard Rule :ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తాజాగా ఓ కీలక నిర్ణయాం తీసుకుంది. ఇకపై మ్యాచ్ ఆడేందుకు మైదానంలోకి దిగేప్లేయర్లు నెక్ గార్డ్‌ను తప్పనిసరిగా ధరించాలంటూ ఓ కొత్త రూల్ తీసుకొచ్చింది. దీని ప్రకారం అక్టోబర్ 1 నుంచి ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచులు ఆడాలనుకునే ప్రతీ ప్లేయర్ కూడా నెక్ గార్డ్ వేసుకోవాల్సిందే అంటూ ఆంక్షలు జారీ చేసింది. దీంతో రానున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆస్ట్రేలియా ప్లేయర్లు అందరూ మెడ పట్టీ వేసుకుని రంగంలోకి దిగనున్నారు.
ఆ ఒక్క గాయం కారణంగా..
Cricket Australia New Rule : సౌతాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో కామెరూన్ గ్రీన్ మెడకి దెబ్బ తగిలింది. కగిసో రబాడా వేసిన ఓ బౌన్సర్ నేరుగా కామెరూన్ మెడకు తగిలింది. అయితే గ్రీన్ ధరించిన హెల్మెట్‌కు నెక్ గార్డ్ ఉండటం వల్ల తృటిలో ప్రమాదం తప్పింది. లేకుంటే రబాడా వేసిన బౌన్సర్ దెబ్బకి గ్రీన్ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లేది. ఇక ఈ మ్యాచ్‌తో ఓ గుణపాఠాన్ని నేర్చుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇకపై తమ క్రికెటర్ల అందరూ నెక్ గార్డ్ తప్పనిసరిగా ధరించాలంటూ రూల్ తీసుకొచ్చింది.