తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫైనల్లో టీమ్​ఇండియా ఓటమి.. సిల్వర్​ సాధించిన మహిళల జట్టు - కామన్​వెల్త్​ క్రికెట్​

CWG 2022 India: కామన్​వెల్త్​ గేమ్స్​లో ఆదివారం జరిగిన మహిళల క్రికెట్​ ఫైనల్​లో టీమ్​ఇండియా వెండి పతకాన్ని సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఓపెనర్లు తక్కువ పరుగులకే ఔటవడం సహా ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా క్రీజులో ఎక్కువ సేపు నిలవకపోవడంతో పసిడి సాధించలేకపోయింది.

టీమ్​ఇండియా
టీమ్​ఇండియా

By

Published : Aug 8, 2022, 4:26 AM IST

CWG 2022 India: కామన్​వెల్త్​లో తొలిసారిగా నిర్వహించిన మహిళల క్రికెట్‌లో భారత్‌ రజత పతకం సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌ పోరులో భారత్‌ పోరాడి ఓటమి చవిచూసింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. హర్మన్‌ ప్రీత్‌కౌర్‌ (65; 43 బంతుల్లో 7×4, 2×6) ఒంటరి పోరాటం చేసింది. చివరలో భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌ చేరడంతో భారత్‌ పసిడిని పట్టలేకపోయింది.

హర్మన్‌ దూకుడు..
ఆస్ట్రేలియా నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన టీమ్‌ ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ స్మృతీమంధాన (6), షపాలీ వర్మ(11) తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు. అప్పటికి జట్టు స్కోరు 22 పరుగులు మాత్రమే. అనంతరం క్రీజులోకి వచ్చిన రోడ్రిగ్స్‌(33)తో కలిసి హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ నిర్మించింది. కానీ ఈ జోడీని మెగన్‌ స్కట్‌ విడదీసింది. 14.3వ బంతికి రోడ్రిగ్స్‌ బౌల్డయింది. తరువాతి ఓవర్లలో గార్డన్‌ర్‌ వరుస బంతుల్లో పూజా వస్త్రాకర్‌(1), హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ను ఔట్‌ చేసి భారత్‌ను దెబ్బకొట్టింది. దీంతో స్వల్ప వ్యవధిలోనే భారత్‌ మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

అయినప్పటికీ భారత్‌ విజయం దిశగానే అడుగులేసింది. వికెట్లు పడ్డప్పటికీ రన్‌రేట్‌ ఏ మాత్రం తగ్గకుండా చూసుకున్న భారత్‌.. విజయానికి చేరువగా వెళ్లింది. ఓ వైపు క్రీజులో దీప్తి శర్మ (13; 8 బంతుల్లో 2×4) ఉండడంతో భారత్‌కు పసిడి పతకం ఖాయమనుకున్నారంతా.. కానీ, 18.3 ఓవర్ల వద్ద స్కట్‌ బౌలింగ్‌లో దీప్తి శర్మ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. దీంతో భారత్‌ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లింది. ఇక చివరి ఓవర్‌లో భారత్‌ విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో యాస్తికా భాటియా, మేఘ్‌నా సింగ్‌ ఉన్నారు. తొలి బంతికి పరుగులు రాలేదు. రెండో బంతికి మేఘ్‌నా సింగ్‌ ఔట్‌ అయింది. తర్వాతి బంతికి యాస్తికా భాటియా ఎల్బీడబ్ల్యూ కావడంతో భారత్‌ పోరాటం ముగిసింది. దీంతో తొలిసారి పసిడిని ముద్దాడుదామనుకున్న భారత్‌ ఆశలు వెండితోనే ఆగిపోయాయి.

అంతకుముందు ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. మూనీ(61) కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. భారత్‌ బౌలర్లలో రేణుకా సింగ్‌, స్నేహ్‌ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టగా..దీప్తి శర్మ, రాధా యాదవ్‌ తలో వికెట్‌ తీశారు.

ABOUT THE AUTHOR

...view details