తెలంగాణ

telangana

ETV Bharat / sports

సొంతగడ్డపై కంగారూలను ఓడించిన జింబాబ్వే.. పసికూన సంచలన విజయం - జింబాబ్వే ఆస్ట్రేలియా మ్యాచ్​ హైలైట్స్​

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో జింబాబ్వే అద్భుత విజయం సాధించింది. కంగారుల గడ్డపై జింబాబ్వేకు ఇది తొలి విజయం.

Zimbabwe Australia match
సొంతగడ్డపై ఆస్ట్రేలియా ఓటమి.

By

Published : Sep 3, 2022, 12:01 PM IST

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో జింబాబ్వే సంచలన విజయం సాధించింది. మూడు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి భారీ షాక్‌ ఇచ్చింది. ఈ విజయంతో క్లీన్‌స్వీప్‌ నుంచి తప్పించుకుంది. కంగారుల గడ్డపై జింబాబ్వేకు ఇది తొలి విజయం.

మొదటి రెండు మ్యాచ్‌లలో ఆరోన్‌ ఫించ్‌ బృందం పర్యాటక జింబాబ్వే మీద వరుసగా 5, 8 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయాలు సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇక నామమాత్రపు మూడో వన్డేలోనూ నెగ్గి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని భావించింది. అయితే, అనూహ్య రీతిలో రెగిస్‌ చకబ్వా బృందం చెలరేగి ఆసీస్‌కు షాకిచ్చింది.

మ్యాచ్​ సాగిందిలా.. టౌన్స్‌విల్లే వేదికగా శనివారం జరిగిన మూడో వన్డేలో టాస్‌ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. రియాన్‌ బర్ల్‌ 5 వికెట్లతో చెలరేగిన నేపథ్యంలో 31 ఓవర్లలోనే కంగారూల ఆట ముగిసింది. 141 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఇందులో ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​(94) టాప్​ స్కోరర్​. ఇక లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వేకు ఓపెనర్‌ తాడివానాషే మారుమని 35 పరుగులతో శుభారంభం అందించాడు. ఇక వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఆరో స్థానంలో బరిలోకి దిగిన కెప్టెన్‌ రెగిస్‌ చకబ్వా 37 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. రియాన్‌ బర్ల్‌ సైతం ఆఖర్లో విలువైన ఇన్నింగ్స్‌ ఆడి (11 పరుగులు) కెప్టెన్‌కు సహకారం అందించాడు. ఈ క్రమంలో 39 ఓవర్లలో 7 వికెట్ల నస్టానికి 142 పరుగులు చేసిన జింబాబ్వే.. ఆతిథ్య ఆసీస్‌ మీద అద్భుత విజయం సాధించింది. రియాన్‌ బర్ల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఇదీ చూడండి: టీమ్‌ఇండియాను లాడ్లాస్ అని ఎందుకంటారంటే

ABOUT THE AUTHOR

...view details