Aus vs Sa Semi Final 2023 :2023 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్.. 3 వికెట్ల తేడాతో నెగ్గింది. సఫారీ జట్టు నిర్దేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్.. 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (62 పరుగులు) హాఫ్ సెంచరీ, స్టీవ్ స్మిత్ (30), జోశ్ ఇంగ్లిస్ (28) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో గెర్లాడ్ 2, షంసీ 2, కగిసో రబాడా, మర్క్రమ్, కేశవ్ మహరాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఫలితంగా ఆసీస్.. అన్ని జట్లకంటే అత్యధికంగా ఎనిమిదోసారి ఫైనల్స్‌కు చేరింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ట్రావిస్ హెడ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
స్వల్ప లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించింది. ఓపెనర్లు హెడ్, వార్నర్ (29) దూకుడుగా ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. హెడ్ ధాటికి 6 ఓవర్లోనే 60 పరుగులు వచ్చాయి. ఇక 6.1 వద్ద వార్నర్.. మర్క్రమ్ వేసిన బంతికి క్లీన్‌బౌల్డయ్యాడు. తర్వాతి ఓవర్లో మిచెల్ మార్ష్ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. అయినా వెనక్కు తగ్గని హెడ్.. స్టీవ్ స్మిత్‌తో కలిసి స్కోర్ బోర్డను నడిపించాడు.
పుంజుకున్నట్టే అనిపించినా..14.1 ఓవర్ వద్ద కేషవ్ మహరాజ్.. హెడ్‌ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత స్కోర్ వేగం మందగించింది. ఈక్రమంలోనే మార్నస్ లబూషేన్ (18), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (1) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. ఫలితంగా ఆసీస్.. 137 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. దీంతో సౌతాఫ్రికా గేమ్‌లోకి వచ్చినట్టు అనిపించింది. కానీ, జోష్ ఇంగ్లిస్‌తో కలిసి స్మిత్.. సఫారీలకు ఛాన్స్ ఇవ్వలేదు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 37పరుగులు జోడించారు. 33.3 వద్ద గెర్లాడ్, స్మిత్ వికెట్ పడగొట్టాడు. దీంతో మళ్లీ సౌతాఫ్రికా శిబిరంలో ఆశలు రేగాయి. కానీ, చివర్లో స్టార్క్ (16), కమిన్స్ (14) ప్రత్యర్థి జట్టు బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. వీరిద్దరూ సింగిల్స్ రొటేట్ చేస్తూ.. జట్టును విజయతీరాలకు చేర్చారు.